Share News

వైసీపీలో కలవరం

ABN , Publish Date - May 29 , 2024 | 10:55 PM

ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతున్న కొలదీ జిల్లా వైసీపీ వర్గాల్లో టెన్షన్‌ పెరిగి పోతోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అనేక సర్వేలు అనుకూలంగా ఉండడం, మరోవైపు పెరిగిన పోలింగ్‌ శాతం వారిని కలవరపరుస్తోంది.

 వైసీపీలో కలవరం

అధికార పార్టీ అభ్యర్థుల్లో కంగారు

వెంటాడుతున్న ఓటమి భయం

ఈ ఎన్నికల్లో ఒడ్డెక్కితే చాలనే భావనలో మరికొందరు..

లేకుంటే రాజకీయ భవిష్యత్‌ ఉండదని ఆందోన

పార్వతీపురం, మే29 (ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతున్న కొలదీ జిల్లా వైసీపీ వర్గాల్లో టెన్షన్‌ పెరిగి పోతోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అనేక సర్వేలు అనుకూలంగా ఉండడం, మరోవైపు పెరిగిన పోలింగ్‌ శాతం వారిని కలవరపరుస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కూడా కూటమికే పడినట్లు ప్రచారం జరుగుతుండడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఓడిపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని కొంతమంది వైసీపీ అభ్యర్థులు మథనపడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాకపోయినా పర్వాలేదు.. నియోజకవర్గంలో తాము గెలిస్తే చాలని మరికొంతమంది భావిస్తున్నారు. తాము అధికారంలో ఉంటే రానున్న ఐదేళ్లు ఏదో విధంగా నెట్టుకురావొచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే.. నియోజకవర్గంలో తాము ఓడి పోయినా.. రాజకీయ భవిష్యత్‌కు ఢోకా ఉండదనే ఆలోచనలో మరి కొం దరు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో కొంతమంది వైసీపీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తాము ఒడ్డెక్కితే చాలనే భావనలో ఉన్నారు. ఎన్నికలకు ముందు 175 స్థానాల్లో గెలుస్తామని చెప్పుకున్న వైసీపీ నాయకుల స్వరం ఇప్పుడు మారింది. పోలింగ్‌ అనంతరం తమ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పలేకపోతున్నారు. ఓటింగ్‌ సరళిపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఈ సారి యువతతో పాటు పెద్దఎత్తున వలస ఓటర్లు కూడా జిల్లాకు తరలివచ్చి.. క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరిగింది. దీంతో జిల్లాలో ఓటింగ్‌ శాతం పెరగ్గా.. ఇది కూటమికి అనుకూలమని అనేక సర్వేలు చెబుతుండడంతో జిల్లా వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొంతమంది వైసీపీ నాయకులు మరింతగా ఆందోళన చెందుతున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

కోట్లలో ఖర్చు..

ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో కొంతమంది వైసీపీ అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో సుమారు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు వెచ్చించారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత భారీగా ఖర్చు పెట్టిన నేపథ్యంలో.. ఒకవేళ ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటని కొందరు వైసీపీ అభ్యర్థులు తమ అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకే విజయం తథ్యమని కొంతమంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో రెండు చోట్ల ్లకూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉంది. దీంతో వైసీపీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

- పోలింగ్‌ అనంతరం సీఎం జగన్‌, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కొంత ఉత్సాహాన్ని నింపింది. గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు సాధిస్తామని వారు ప్రకటించడం.. ఆ పార్టీ నేతల్లో ఽధీమాను పెంచింది. దీంతో కొందరు నేతలు పందాలకు దిగారు. కాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే విజయావకాశాలు ఎక్కువుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, సర్వేలు చెబుతుండడంతో వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారు. దీంతో కొందరు బెట్టింగ్‌లకు ముందుకు రావడం లేదు.

Updated Date - May 29 , 2024 | 10:55 PM