పార్వతీపురం ఎమ్మెల్యేపై కోడ్ ఉల్లంఘన కేసు
ABN , Publish Date - Mar 26 , 2024 | 11:30 PM
పార్వతీపురం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ మేరకు పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు.
పార్వతీపురం టౌన్, మార్చి 26 : పార్వతీపురం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ మేరకు పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఈనెల 21న జిల్లా కేంద్రంలోని కొత్తవలస నవదుర్గా ఆలయం వద్ద వలంటీర్లు, గృహ సారఽథులతో పాటు సంబంధింత ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే జోగారావు సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా 6వవార్డులోని రాజీవ్ కొత్త పోలమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కోరాడ నారాయణరావు, టీడీపీ నాయకులు మజ్జి కృష్ణమోహన్, ఎం.వెంకటేష్, పాలకొండ రాజశేఖర్, తదితరులు అక్కడకు వెళ్లారు. అయితే టీడీపీ నాయకులు వస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న వార్డు వలంటీర్లు, గృహసారఽథులు నవదుర్గా ఆలయం నుంచి జారుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ టీడీపీ నాయకులు ఆ ప్రాంతంలో నిరసన తెలిపారు. దీనిపై పట్టణ పోలీసులతో పాటు సంబంధిత ఎన్నిక అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఎట్టకేలకు ఎన్నికల నిబంధనలను ఎమ్మెల్యే ఉల్లంఘించడంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ కూడా ఈ విషయం వెల్లడించారు. అధికారులు ఇచ్చిన సమాచారం, పోలీసుల దర్యాప్తుపై విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.