Share News

జ్వరంతో చిన్నారి మృతి

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:37 PM

జ్వరంతో గిరిజన చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జ్వరంతో చిన్నారి మృతి
నైనిక (ఫైల్‌)

- ఆలస్యంగా వెలుగులోకి

- వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా?

కొమరాడ, జనవరి 30: జ్వరంతో గిరిజన చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొమరాడ మండలం చోళ్లపదం పంచాయతీ పరిధిలోని నాగావళి నది ఆవల ఉన్న రెబ్బ గ్రామానికి చెందిన ఏడాది చిన్నారి కడ్రక నైనిక ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందినట్లు తల్లిదండ్రులు కడ్రక సూరమ్మ, పారయ్య తెలిపారు. నైనికకు జ్వరం రావడంతో ఈ నెల 25న కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. దీంతో అదే రోజు సాయంత్రం 4 గంటలకు పార్వతీపురం వైద్యశాలకు చిన్నారిని తీసుకెళ్లారు. ఇక్కడ చికిత్స అందించిన అనంతరం అదేరోజు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో విజయనగరంలోని చిన్న పిల్లల వైద్యశాల ఘోషాసుపత్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. దీంతో మరుసటి రోజు 7 గంటలకు కేజీహెచ్‌లో జాయిన్‌ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 28న నైనిక మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

వైద్య సదుపాయం ఏదీ?

రెబ్బ, వానధార గ్రామాలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఈ గ్రామాలకు వైద్య సిబ్బంది చేరుకోవాలంటే నాగావళి నదిని దాటాలి. దీంతో ఈ గ్రామాల వైపు వైద్య సిబ్బంది కన్నెత్తిచూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో తమ గ్రామాల్లో పలువురు జ్వరాలబారిన సమ యంలో కూడా వైద్య సిబ్బంది రాలేదని, పత్రికల్లో కథనాలు వస్తే తప్ప ఇక్కడకు రావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ నెల 25న జ్వరంతో బాధపడుతూ కేఆర్‌బీ పురం పీహెచ్‌సీకి నైనికను తీసుకువస్తే మరుసటి రోజు కూడా గ్రామానికి వైద్య సిబ్బంది వెళ్లలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. నైనికతో పాటు ఆమె సోదరి శ్రీలత కూడా జ్వరంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంది. అయితే నైనిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేటప్పుడు శ్రీలతను కూడా ఇంటికి తీసుకువచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ముఖ్యంగా పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో ఉండకపో వడం, గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటనలు, వైద్య శిబిరాలు అంతంత మాత్రంగానే ఉండటంతో గిరిజనులకు ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్మోహన్‌ రావు వివరణ కోరగా.. చిన్నారి నైనిక మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాన్ని సందర్శించడంతో పాటు చిన్నారికి అందించిన వైద్యంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Jan 30 , 2024 | 11:37 PM