Share News

స్థలం మార్చేసి.. వదిలేసి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:46 PM

గిరిజన యూనివర్సిటీ.. రాష్ట్ర విభజన హామీల అమలులో భాగంగా కేంద్రం ప్రకటించిన ఉన్నత విద్యాలయం. భవన నిర్మాణం పూర్తయితే 14 అకడమిక్‌ కోర్సుల్లో గిరిజన విద్యార్థులు చదువుకునే అవకాశం ఉండేది. వారి బంగారు భవిష్యత్‌కు చక్కని అడుగులు పడి ఉండేవి. కేంద్రం తలచినది ఇదైతే జరుగుతున్నది మరొకటి.

స్థలం మార్చేసి.. వదిలేసి
యూనివర్సిటీ భూములు, (ఇన్‌సెట్‌లో) భూములిచ్చిన రైతులు

స్థలం మార్చేసి.. వదిలేసి

అంగుళం కదలని గిరిజన యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు

అంచనా కొండంత.. నిధులు విడుదల గోరంత

భూముల పరిహారంపైనా ప్రభుత్వం కాకి లెక్కలు

అరకొర విదిలింపుపై రైతుల గగ్గోలు

సంవత్సరాలుగా విజయనగరంలోనే వర్సిటీ తరగతులు

ఎన్నాళ్లీ తాత్కాలిక వసతి అంటూ విద్యార్థుల నిరాశ

గిరిజన యూనివర్సిటీ.. రాష్ట్ర విభజన హామీల అమలులో భాగంగా కేంద్రం ప్రకటించిన ఉన్నత విద్యాలయం. భవన నిర్మాణం పూర్తయితే 14 అకడమిక్‌ కోర్సుల్లో గిరిజన విద్యార్థులు చదువుకునే అవకాశం ఉండేది. వారి బంగారు భవిష్యత్‌కు చక్కని అడుగులు పడి ఉండేవి. కేంద్రం తలచినది ఇదైతే జరుగుతున్నది మరొకటి. ఎనిమిదేళ్ల కిందటే వర్సిటీ భూసేకరణ పూర్తయ్యి ప్రహరీ నిర్మాణం మొదలై.. తాత్కాలికంగా విజయనగరంలో తరగతులు ప్రారంభం కాగా వైసీపీ ప్రభుత్వం పుణ్యమాని ఇప్పటికీ వర్సిటీ ఎక్కడుందో చెప్పలేని దుస్థితి. గత ప్రభుత్వం నిర్మాణానికి సిద్ధపడగా ఈ ప్రభుత్వం స్థలం మార్చేసి వదిలేసింది. ఎన్నాళ్లీ తాత్కాలిక వసతి అంటూ విద్యార్థులూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మెంటాడ, ఏప్రిల్‌ 26:

‘‘గిరిజన విద్యార్థుల కల నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. గత ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని గాలికొదిలేసింది. మన ప్రభుత్వం ఇప్పుడు శంకుస్థాపన చేసింది. ఈ రోజునుంచే పనులు పరుగులు తీస్తాయి’’ ట్రైబల్‌ యూనివర్సిటీ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి జగన్‌ వల్లెవేసిన పలుకులివి. అబ్బో జగనన్నకి ఎంత ప్రేమో అని విద్యార్థులు మురిసిపోయారు. ఎనిమిది నెలలైనా పనులే ప్రారంభం కాలేదు. భూములిచ్చిన అన్నదాతలకైనా పూర్తి స్థాయిలో పరిహారం అందిందా అంటే అదీ లేదు. పనులు ఎప్పుడు మొదలుపెడతారని అడిగితే జవాబు చెప్పే నాథుడు లేడు. టీడీపీ ప్రభుత్వ హయంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద సుమారు 500 ఎకరాలను సేకరించింది. తొలివిడత నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభించింది. ప్రహరీని పూర్తి చేసింది. అంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారిపోవడం జరిగింది. వర్సిటీకి కూడా గ్రహణం మొదలైంది. నాలుగేళ్ల పాటు ఏవేవో సాకులు చెప్పి తర్వాత స్థలం మార్చేశారు. మెంటాడ మండలం కుంఠినవలస దత్తిరాజేరు మండలం మర్రివలస గ్రామాల పరిధిలో 561.88 ఎకరాలను సేకరించారు. రూ.834 కోట్లతో భవన నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా శంకుస్థాపనకు హాజరయ్యారు. ఎన్నికల ముంగిట క్రతువుని హట్టహాసంగా జరిపారు. ఎనిమిది నెలలైనా పనులు మొదలుకాలేదు.

ఇంకెన్నాళ్లు అంటున్న విద్యార్థులు

గిరిజన వర్సిటీ పూర్తయితే పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లీష్‌, సోషియాలజీ, ట్రెబల్‌ స్టడీస్‌, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎఎస్‌ డబ్ల్యు, డిగ్రీ స్థాయిలో ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ,. టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్మెంట్‌, బి.కాంలో ఒకేషనల్‌ తదితర 14 అకడమిక్‌ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. ఈ వివరాలను ఎంతో గొప్పగా శంకుస్థాపన సభలో చెప్పుకొచ్చిన జగన్‌ 8 నెలలుగా పనులు మొదలు కాకపోయినా సమీక్షించిన దాఖలాలు లేవు. దాదాపు పదేళ్లుగా ఎదురుచూస్తున్న గిరిబిడ్డలు ఇంకెన్నాళ్లని ప్రశ్నిస్తున్నారు.

రైతులపై కపట ప్రేమ

గిరిజన వర్సిటికి సేకరించిన 561 ఎకరాల్లో జిరాయితీ కేవలం 66 ఎకరాలు కాగా డిపట్టా, ఆక్రమణ, గెడ్డవాగు భూములు అధికం. జిరాయితీకి ఎకరాకు రూ.16 లక్షలు, డిపట్టాకు ఎకరాకు రూ.9 లక్షలు, ఆక్రమణ భూములకు రూ.3 లక్షల వంతున పరిహారం ఇస్తామని చెప్పుకొచ్చారు. సొమ్ము చెల్లించాక భూముల్లోకి అడుగు పెడతామన్నారు. అరకొరగా ఇచ్చి మమ అనిపించేశారు. ఆయా భూముల్లో ఉన్న వృక్ష సంపదకు, బోర్లు, బావులకు కూడా పరిహారం ఇస్తామని చెప్పి విస్మరించారు. భూములు త్యాగం చేసినందుకు ఇదా బహుమానం అని రైతులు ఆగ్రహిస్తున్నారు..

ప్రశ్నిస్తే బెదిరింపులు

పరిహారం అందని రైతులు తాము ఇచ్చిన భూముల్లో ప్రస్తుత సీజన్లో పంటకు వచ్చిన మామిడి, జీడిమామిడిని సేకరించాలనుకున్నారు. రైతులు పంట కోతకు వెళ్తే అక్కడి కాపలాదారులు నో ఎంట్రీ చెప్తున్నారు. భూములిచ్చిన రైతులమయ్యా అని చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు. మొండికేస్తే కేసులు పెడతామని జులుం ప్రదర్శిస్తున్నారని బాధిత రైతాంగం కన్నీటి పర్యంతమవుతోంది.

నిధులు ఏమైనట్టు?

గిరిజన వర్సిటీకి భూములిచ్చిన రైతులకు పరిహారం కింద రూ.29.97 కోట్లు చెల్లించినట్టు, మౌలిక వసతుల కల్పనకు మరో రూ.28.49 కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అలాంటప్పుడు రైతులకు అరకొర పరిహారం అందడంలో మర్మమేమిటన్నది సర్కారే సెలవివ్వాలి. అలాగే మౌలిక సదుపాయాల కల్పిన కోసం రూ.28.49 కోట్లు ఇచ్చామని చెబుతున్నప్పుడు పనులు అంగుళం కూడా ముందకు కదల్లేదంటే ఏమని అర్థం చేసుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భూములు త్యాగం చేసిన రైతులందరిదే ఒకటే వ్యధ. జీవితాలకు ఆదరువుగా ఉన్న భూములిచ్చిన పాపానికి తమను రోడ్డుపాలు చేశారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

కారుచౌకగా కొట్టేయాలని వ్యూహం

మొదట్లో రెల్లివలస వద్ద భూమి సేకరించారు. మళ్లీ పాచిపెంట మండలంలో స్థల సేకరణ చేశారు. అక్కడ జిరాయితీ భూములు ఎక్కువగా వుండడంతో రైతులకు పరిహారం ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని భావించి కుంటినవలస వద్ద భూ సేకరణకు దిగారు. ఇక్కడ కేవలం 66 ఎకరాలు జిరాయితీ వుండడం, గెడ్డ వాగు 250 ఎకరాలు, మిగతా డిపట్టాలు సుమారు 300 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. కొండకు ఆనుకొని వందలాది ఎకరాలు ఉండడంతో ఇక్కడ ప్రభుత్వ పెద్దలంతా వాలిపోయారు. ఈ ప్రాంతమే యూనివర్సిటీకి అనువైనదంటూ ఎంపిక చేశారు.

శిలాఫలకం ఎక్కడ?

ఆగస్టు 25న ముఖ్యమంత్రి జగన్‌ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చకచకా పనులు జరిగిపోతాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తాను చెమటోడ్చి యూనివర్సిటీరి ఇక్కడకు తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని తన అన్న మంత్రి బొత్స సత్యన్నారాయణతో మాట్లాడి వర్సిటీని తెచ్చానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ప్రారంభోత్సవం అయిన వెంటనే అధికారులు శిలాఫలకాన్ని అక్కడ నుంచి తొలగించేశారు. శిలాఫలకం జాడలేదు.. అంగుళం అభివృద్ధి లేదు.

సమాధానం చెప్పేవారేరి?

అలమండ గౌరి. రైతు కుంఠినవలస గ్రామం

మా నాన్న నగర రాము జిరాయితీ, డిపట్టా కలిపి 3.82 ఎకరాలు ఇస్తే రూ.16 లక్షలే ముట్టజెప్పారు. మిగతాసొమ్ము గురించి సమాధానం చెప్పేవారు కరువయ్యారు. భూములు పోయాయి పూర్తి పరిహారం అందలేదు. చెట్లు గురించి అడిగితే ఉలుకూపలుకు లేదు.

రెండెకరాలకు రూ.2 లక్షలా?

జంగం రాము కుంటినవలస గ్రామం

రెండెకరాల డిపట్టా భూమికి కేవలం రూ.రెండు లక్షలు ఇచ్చారయ్యా. ఇదెక్కడి నాయ్యం? ఇలా చేస్తారనుకోలేదు. ఇంటికొక ఉద్యోగం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అప్పట్లో చెప్పారు. ఇప్పుడు వాటి ఊసు ఎత్తితే పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని చీడపురుగుల్లా చూస్తున్నారు.

దొంగల్లా చూస్తున్నారు .

చాకల పెద సింహాచలం, కుంటినవలస గ్రామం

20 ఏళ్ల క్రితం డిపట్టాలు ఇచ్చారు. ఇంటిల్లిపాదీ బిందెలతో నీరుమోసి జీడిమామిడి సాగుచేశాం. ఫలసాయం అందుతుందనేసరికి భూములు లాగేసుకున్నారు. ఎకరానికి రూ.9 లక్షలు అనిచెప్పి రూ.1.60 లక్షలే ఇచ్చారు. భూముల, చెట్లు పోయాయి. డబ్బులు పడలేదు. తోటలోకి వెళితే తరిమేస్తున్నారు. దొంగల్లా చూస్తున్నారు.

మమ్మల్నే తరిమేస్తున్నారు

కర్రి చిన్నమ్మ, రైతు, కుంటినవలస

ఎకరం జిరాయితీ భూమికి రూ.16 లక్షలు అని చెప్పి రూ.4లక్షలు ఇచ్చి గొప్ప ఉపకారం చేసినట్టు చెప్పుకొస్తున్నారు. ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. వంటచెరుకు కోసం నా భూమిలోకి వెళ్తే దొంగలా చూస్తున్నారు. కలవని అధికారులు లేరు. ఎక్కని గడపలేదు. గ్రామ పెద్దలు సైతం పట్టించుకోవడం లేదు.

కనికరించడం లేదు

సింగారపు లక్ష్మి, దివ్యాంగురాలు, కుంటినవలస

భర్త సహా నా అన్న వారెవరూ లేరు. జీవచ్ఛవంలా బతుకీడుస్తున్నాను. 1.30 ఎకరాల డిపట్టా భూమి తీసుకొని కేవలం రూ.2లక్షలే చేతిలో పెట్టారు. ఇచ్చిన దాంతో సరిపెట్టుకోమన్నారు. ఎక్కడికీ వెళ్లలేక కూతురు వద్ద తలదాచుకుంటున్నాను. వికలాంగ ఫించన్‌తో కాలం నెట్టుకొస్తున్నాను.

Updated Date - Apr 26 , 2024 | 11:46 PM