Share News

ఈసారి మారాల్సిందే!

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:37 PM

వైసీపీ ప్రభుత్వంపై మహిళల్లో తీవ్ర నిరాశ ఉంది. వారంతా మార్పు కోరుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో బొత్స కుటుంబం హవా.. బెల్ట్‌ షాపుల దందా.. నింగినంటిన నిత్యా వసరాల ధరలు వారిని ఆవేదనకు గురి చేస్తున్నాయి.

ఈసారి మారాల్సిందే!

ఈసారి మారాల్సిందే!

వైసీపీ ప్రభుత్వ విధానాలపై మహిళల్లో వ్యతిరేకత

జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి మార్పుపై ఇప్పటికీ అనుమానాలు

బెల్ట్‌షాపులపై తీవ్ర అసంతృప్తి.. నిత్యావసరాల ధరలపైనా అంతే

విజయనగరం (ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వంపై మహిళల్లో తీవ్ర నిరాశ ఉంది. వారంతా మార్పు కోరుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో బొత్స కుటుంబం హవా.. బెల్ట్‌ షాపుల దందా.. నింగినంటిన నిత్యా వసరాల ధరలు వారిని ఆవేదనకు గురి చేస్తున్నాయి. సీఎం జగన్‌పై ఆయన సోదరి షర్మిల చేస్తున్న విమర్శలు కూడా మహిళలను ఆలోచింప జేస్తున్నాయి. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారంతా పూర్తి స్పష్టతకు వస్తున్నారు. ఎవరిని కదిపినా తోడబుట్టిన సోదరి అబద్ధం చెప్పదు కదా అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో తడాఖా చూపేందుకు సిద్ధంగా ఉన్నారు.

నా అక్కలు.. నా చెల్లెమ్మలు అంటూ ప్రసంగాలు ప్రారంభించడంతో ఏమైనా మేలు చేస్తారేమోనని 2019లో మహిళలు అధికంగా జగన్‌కు మద్దతు పలికారు. ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ ప్రజా వ్యతిరేకంగా ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆ ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు-కుంకుమల కింద మహిళలకు రూ.20 వేల నగదును వారి అకౌంట్‌లలో జమ చేశారు. అయినా గాని అత్యధికంగా జగన్‌కే ఓటేశారు. తమ జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తాయనుకున్నారు. ఊహించిందొకటి కాగా జరిగిందొకటి కావడంతో వారంతా ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మారారు. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ కింద అధిక మొత్తంలో డ్వాక్రా రుణాలు ఇవ్వగా.. ఈ ప్రభుత్వం ఆ రుణాన్ని రూ.3లక్షలకు తగ్గించింది. అప్పటి ప్రభుత్వంలో పేదలకు టిడ్కో ఇళ్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకూ వాటిని లబ్ధిదారులకు అందివ్వలేదు. పైగా లబ్ధిదారుల జాబితాలను నచ్చినట్టు మార్చేశారన్న విమర్శ ఉంది. మరోవైపు ప్రభుత్వానికి ఉద్యమాల సెగ కూడా తగలనుంది. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 43 రోజులు ఉద్యమించారు. వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం మానేసి బెదిరించి సమ్మె విరమించేటట్టు ప్రభుత్వం వ్యవహరించింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం.. వేతనాల ఆలస్యం.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపుల కేసులు పెరగడం తదితర అంశాలపై విద్యావంతులు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు.

- మరోవైపు దశలవారీగా మద్య నిషేధం అంటూ చెప్పిన జగన్‌ దశలవారీగా విక్రయాలు పెంచారని మహిళలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బెల్ట్‌షాపులు లేని ప్రాంతాలు లేవంటున్నారు. దీనివల్ల చాలా కుటుంబాలు వీధిన పడ్డాయన్నది వారి అంచనాగా ఉంది. అదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి అందరూ భయపడుతున్నారు. ఽధరల స్థీరీకరణ నిధి ఏర్పాటు చేసి వ్యత్యాసాలు తగ్గిస్తామని చెప్పిన జగన్‌ ఆచరణలో విఫలమయ్యారని వారు విమర్శిస్తున్నారు. విజయనగరం జిల్లాలో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో వున్నారు. వీరి ప్రతికూల ప్రభావం వైసీపీపై స్పష్టంగా పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

- టీడీపీ ప్రభుత్వం ఎంతోమంది మహిళలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించింది. అణగారిన వర్గాలకు చెందిన స్వాతీరాణిని గత జడ్పీ చైర్‌పర్సన్‌ను చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక అదే పదవి ఎస్సీ మహిళకు తొలుత రిజర్వ్‌ అయింది. అంతలోనే రిజర్వేషన్‌ మారేలా బొత్స చక్రం తప్పి తన మేనల్లుడిని చైర్మన్‌ చేసి ఎస్సీ మహిళలకు ద్రోహం చేశారని ఆ వర్గం మహిళల్లో కోపం ఉంది.

వీధికో బెల్ట్‌షాపు

ఆదిలక్ష్మి, గృహిణి, గంట్యాడ మండలం తామరాపల్లి

గెలిచిన తరువాత దశలవారీ మద్యనిషేధం తీసుకొస్తామన్నారు. వీధికో బెల్టుషాపు వెలిసింది. వేతనం సరిపోక పేద కుటుంబాలు ఆర్థికంగా అగచాట్లు పడుతున్నాయి. పెరిగిన విద్యుత్‌ బిల్లులను చూస్తే వణుకు పుడుతోంది. అమ్మఒడి అర్హులందరికీ అందలేదు.

ఇల్లు కట్టుకోలేకపోతున్నాం

కె.కొండమ్మ, నెల్లిమర్ల

పెరిగిన ఇనుము, సిమెంట్‌ , ఇసుక ధరలను చూస్తే సొంత ఇంటిని కట్టుకోలేమనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం ఉండేది. ఇప్పుడు కొనాల్సి వస్తోంది. అది కూడా సామాన్యులకు అందనంత ధరకు కొంటున్నాం. మహిళా సాధాకారిత అంటూనే జగన్‌ మహిళలకు టోకరా వేశారు.

Updated Date - Feb 01 , 2024 | 11:37 PM