పశు సంపద.. ఏదీ సంరక్షణ?
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:21 AM
జిల్లాలో పశుగణనకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఎన్ని పశువులు ఉన్నాయి, ఏయే రకాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బంది పర్యటించనుంది.

సంతల నుంచి కబేళాలకు..
జిల్లా నుంచి ఇతర రాష్ర్టాలకు యథేచ్ఛగా అక్రమ రవాణా
గత ఐదేళ్లూ పాడి పరిశ్రమపై దృష్టి సారించని వైసీపీ సర్కారు
కూటమి ప్రభుత్వ చొరవతో గోశాలల నిర్మాణం
నేటి నుంచి ‘పశుగణన’ నేపథ్యంలో ప్రత్యేక కథనం
పార్వతీపురం, అక్టోబరు24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పశుగణనకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఎన్ని పశువులు ఉన్నాయి, ఏయే రకాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బంది పర్యటించనుంది. జిల్లాలో వివిధ రకాల పశువులు సుమారు 12 లక్షల వరకు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతంలో పోలిస్తే వాటి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గడం, పశుగ్రాసం కొరత, దాణా ఖర్చుల ఎక్కువవడం తదితర కారణాలతో గ్రామీణ ప్రాంతవాసులు పశు పెంపకంపై దృష్టి సారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పశువుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోందనేది కాదనలేని వాస్తవం. మరోవైపు సాలూరు, పార్వతీపురం, కూనేరు తదితర ప్రాంతాల్లో ప్రతివారం నిర్వహించే సంతల నుంచి వందలాది పశువులు ఎటువంటి అనుమతులు లేకుండా కబేళాలకు తరలిపోతున్నాయి. జిల్లా నుంచి చెన్నై, హైదరాబాద్, కేరళ తదితర ప్రాంతాలకు పశువులు అక్రమ రవాణా చేస్తున్నా.. అడ్డుకునే వారే కరువయ్యారు.
పశువైద్యుల కొరత..
జిల్లాను పశువైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తంగా 38 మంది డాక్టర్లు అవసరం కాగా 20 మంది మాత్రమే ఉన్నారు. దీనివల్ల మూగజీవులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారని చెప్పుకుంటూ వచ్చిన గత వైసీపీ ప్రభుత్వం పశువైద్యులను నియామకానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు పశువైద్యశాలల నిర్మాణాలపైనా దష్టి సారించలేదు. జిల్లాలో 45 ఆసుపత్రులు ఉండగా.. వాటిల్లో పది మాత్రమే బాగున్నాయి. మిగిలిన పశువైద్యశాలల భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. వాటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. గత టీడీపీ ప్రభుత్వంలో పశువుల కోసం ప్రత్యేక షెడ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించేవారు. అయితే గత ప్రభుత్వం వాటికీ మంగళం పాడేసింది. పశువుల షెడ్లకు చెల్లించాల్సిన ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించింది. మొత్తంగా మూగజీవాలు, పాడి రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ...
కూటమి ప్రభుత్వం మూగజీవులపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ప్రతి మూగజీవికి గూడు కల్పించాలని లక్ష్యంతో గోశాలలను మంజూరు చేసింది. జిల్లాలో సుమారు 375 గోశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 270 గోశాలలకు అనుమతులు మంజూరు చేశారు. మూగ జీవులకు గూడు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం పశువులు కబేళాలకు తరలిపోకుండా చూడాల్సి ఉంది. పశువైద్యశాలల నిర్మాణాలు, వైద్యుల నియామకాలు, మూగజీవాల రక్షణతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
వివరాలు సేకరిస్తాం..
నేటి నుంచి పశుగణన కార్య క్రమం జరగనుంది. జిల్లాలో ఉన్న పశువులను పూర్తిస్థాయిలో లెక్కించనున్నాం. గత గణాంకాల ప్రకారం ‘మన్యం’లో సుమారు 12 లక్షల పశువులు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిందో లేదో తెలుసుకుంటాం. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తాం. ఇందుకోసం 25 మంది సూపర్‌వైజర్లు, 276 మంది సిబ్బందిని నియమించాం. మొదటిసారి యాప్ ద్వారా పశుగణన చేపడతాం.
- ఎస్.మన్మథరావు, జిల్లా పశు సంరక్షణాధికారి, పార్వతీపురం మన్యం