రక్తహీనత కేసులు తగ్గాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:32 AM
జిల్లాలో ప్రతినెలా రక్తహీనత (ఎనీమియా) కేసుల్లో తగ్గుదల కనిపించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పార్వతీపురం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతినెలా రక్తహీనత (ఎనీమియా) కేసుల్లో తగ్గుదల కనిపించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎనీమియా నివారణకు పెద్దఎత్తున పోషకాహారం, మందులు పంపిణీ చేస్తున్నా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇకపై వైద్యాధికారులు రక్తహీతన కేసులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, కేసుల తగ్గుదలపై నివేదిక అందించాలని ఆదేశించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించకుంటే సంబంధిత వార్డెన్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణ బాధ్యత మహిళా శిశు సంక్షేమశాఖదేనని తెలిపారు. తోణాం, దుడ్డుకళ్లు పీహెచ్‌సీల పరిధిలో అధికంగా ఎనీమియా కేసులు నమోదవడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి వారం రోజుల పాటు అక్కడే బస చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఫీడర్ అంబులెన్స్‌ల వినియోగంపై చర్యలు తీసుకోవాలన్నారు. సికిల్‌సెల్ వ్యాధిగ్రస్థుల కోసం పార్వతీపురం, సాలూరు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎం.వినోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు టి.జగన్మోహన్‌రావు, పద్మావతి , డీఈవో ఎన్.తిరుపతినాయుడు, జిల్లా ఆసుపత్రి సమన్వయాధికారి వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.