Share News

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:42 PM

జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లావ్యాప్తంగా 66 కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 10,746 మంది విద్యార్థులకు గాను 10,423 మంది హాజరయ్యారు. 323 మంది గైర్హాజరయ్యారు.

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
పార్వతీపురం మండలంలో ఓ పరీక్ష కేంద్రం బయట ఎండలోనే నిరీక్షిస్తున్న విద్యార్థులు

తొలిరోజు 323 మంది విద్యార్థుల గైర్హాజరు

పార్వతీపురం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం జిల్లావ్యాప్తంగా 66 కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు నడుమ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 10,746 మంది విద్యార్థులకు గాను 10,423 మంది హాజరయ్యారు. 323 మంది గైర్హాజరయ్యారు. పార్వతీపురం మండలంలో డోకిశిలా, పెదబండపల్లిలో పరీక్ష కేంద్రాలను డీఈవో పగడాలమ్మ పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కాగా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. నిర్ణీత సమయానికి కన్నా గంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకు న్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు ప్రైవేట్‌ వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణించి.. ఉరుకులు పరుగులతో కేంద్రాలకు వెళ్లారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాల బయట సందడి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఎండలోనే విద్యార్థులు...

పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని ఉన్న ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పరీక్ష కేం ద్రం వద్ద టెంట్‌ ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఎండలోనే వారంతా నిరీక్షించాల్సి వచ్చింది. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

రెండోపూటకు పడిగాపులు

భామిని: భామిని ఆదర్శ పాఠశాలలో సోమవారం ఉదయం టెన్త్‌ పరీక్షలు నిర్వహించగా.. రెండో పూట తరగతుల కోసం విద్యార్థులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆరు నుంచి తొమ్మిది తరగతులకు చెందిన బత్తిలి, పెద్దదిమిలి విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటలకే పాఠశాలకు చేరుకోగా.. చెట్లు కింద, నీడ ప్రాంతాల్లో నిరీక్షించాల్సి వచ్చింది. కాగా రెండోపూట పాఠశాలలో తరగతులు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. కీసర, కోసలి, నేరడి, వడ్డంగి, లోహరజోల తదితర దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు మండుటెండలో పాఠశాలకు బయల్దేరడం ఇబ్బందిగా ఉందని వారు వాపోతున్నారు. ఈ వారం రోజులు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:42 PM