Share News

సంతల్లో కొనుగోలు చేసి.. కబేళాలకు తరలించి..

ABN , Publish Date - May 19 , 2024 | 12:25 AM

ఆ వ్యాపారం కోసం అధికారులకు తెలిసినా పట్టించుకోరు. అటు వైపు కన్నెతి చూడరు. పశువుల మార్కెట్‌ ముసుగులో కబేళాలకు మూగజీవాలను తరలిస్తున్నా పట్టించుకొనే నాథుడు లేడు. దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

సంతల్లో కొనుగోలు చేసి..  కబేళాలకు తరలించి..
వాహనాల్లో పశువులను తరలిస్తున్న దృశ్యం

- ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా పశువుల తరలింపు

- పోషణ భారమై విక్రయిస్తున్న రైతులు

- సంతలే ప్రధాన కేంద్రాలుగా వ్యాపారం

- పట్టించుకోని అధికారులు

గజపతినగరం, మే 18: ఆ వ్యాపారం కోసం అధికారులకు తెలిసినా పట్టించుకోరు. అటు వైపు కన్నెతి చూడరు. పశువుల మార్కెట్‌ ముసుగులో కబేళాలకు మూగజీవాలను తరలిస్తున్నా పట్టించుకొనే నాథుడు లేడు. దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జిల్లాలోని పెదమానాపురం, అలమండ, అచ్చుతాపురం తదితర ప్రాంతాల్లో వారపు సంతలు జరుగుతుంటాయి. ఈ సంతలకు జిల్లా నలుమూలల నుంచి రైతులు వచ్చి పశువులను క్రయవిక్రయాలు చేపడుతుంటారు. అయితే, కొందరు వ్యాపారులు రైతుల నుంచి పశువులను కొనుగోలు చేసి వాటిని వాహనాల్లో కబేళాలకు తరలిస్తున్నారు. ఎక్కడైనా పోలీసులకు చిక్కినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఆ వాహనాలను వదిలే స్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కబేళాల వ్యాపారం జోరుగా సాగుతోంది. పూర్వం పశు పోషణకు ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పొలం గట్టు మీద పచ్చగడ్డి, మొక్కజొన్న, పిల్లి పెసర, సొప్పలాంటి పచ్చిమేత వేసి పశువులను పెంచేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో పశువుల పెంపకం రైతులకు భారంగా మారింది. జత పశువుల పోషణకు నెలకు రూ.20వేల నుంచి రూ.25వేలు ఖర్చు అవుతుంది. గతంలో అయితే ఒట్టి పోయిన పశువులను వ్యవసాయ పనులకు ఉపయోగించే వారు. ప్రస్తుత పరిస్థితిల్లో సాగుకు యంత్రాలు రావడంతో అవి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి. దీంతో వాటిని వదిలించుకోవడానికి రైతులు ఎదురు చూస్తున్నారు. ఆవులు, గేదెలు, ముసలి ఎద్దులను సంతలకు తరలించి కబేళాలకు అమ్మివేస్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు తరలింపు..

ప్రతీవారం గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సంత నుంచి కబేళాలకు పశువులు తరలిపోతున్నాయి. శనివారం సంత కావడంతో వ్యాపారులు శుక్రవారానికి చేరుకొని పశువులను కొనుగోలు చేసి భారీ వాహనాల్లో ఒడిశా, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అధికారుల చప్పుడు అయితే అడ్డుదారుల్లో రవాణా చేస్తుంటారు. సోమవారం జరిగే అలమండ సంతకు కాలినడకన పశువులను తరలించి అక్కడి నుంచి వాహనాల్లో ఇతర ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. పశువుల మార్కెట్లపై నిఘా కొరవడింది. గతంలో రెవెన్యూ, పోలీసు, పశువైద్య, ఈవోపీఆర్డీ అధికారులతో కమిటీ వేసి పశు అక్రమ రవాణాను అడ్డుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు ఎక్కడా కానరావడం లేదనే విమర్శలు ఉన్నాయి.

చర్యలు తీసుకుంటాం

నిబంధనలు అతిక్రమించి పశువులను అక్రమంగా తరలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల బొండపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాలను పట్టుకొని సీజ్‌ చేశాం. పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.

-ఎన్‌వీ ప్రభాకరరావు, సీఐ, గజపతినగరం

అధికారులు పట్టించుకోవడం లేదు

లైసెన్స్‌ లేకుండా కబేళాలకు పశువులను తరలించడం చట్ట రీత్యా నేరం. అయినా అధికారులు మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవడం లేదు. గూడ్స్‌ వ్యాగన్‌ వంటి వాహనాల్లో పశువులను తరలిస్తే అధికారులు తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి. వాహనాలకు ఆర్టీవో అనుమతులు ఉండాలి. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పశువుల అక్రమ రవాణా చేసే వాహనాలపై ఆర్టీవో, పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

-జీవబందు లోగిస రామకృష్ణ, రాష్ట్ర గో సంరక్ష సమితి అధ్యక్షుడు.

Updated Date - May 19 , 2024 | 12:25 AM