Share News

సిద్ధం సభకు బస్సులు

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:31 PM

ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్‌ అనకాపల్లిలో నిర్వహించనున్న సిద్ధం సభకు జిల్లా నుంచి సుమారు 130 బస్సులు తరలించే ఏర్పాట్లలో అధికారులు ఉన్నట్టు సమాచారం.

సిద్ధం సభకు బస్సులు

ఆదేశాలు రాలేదంటున్న అధికారులు

పార్వతీపురం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్‌ అనకాపల్లిలో నిర్వహించనున్న సిద్ధం సభకు జిల్లా నుంచి సుమారు 130 బస్సులు తరలించే ఏర్పాట్లలో అధికారులు ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. పార్వతీపురం, సాలూరు, పాలకొండ వాసులతో పాటు 15 మండలాల్లో ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అయితే ఆర్టీసీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల ఇక్కట్లు పట్టించుకోరా? అంటూ జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా జిల్లా నుంచి బస్సులు కేటాయించడంపై వారు మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు బస్సులను తరలిస్తుండడంతో తరచూ నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. కాగా ప్రస్తుతం ఇది శుభకార్యాల సీజన్‌ జిల్లాలో భారీగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు తదితర ఫంక్షన్లు ఎక్కువగా జరుగతున్నాయి. ఈ నేపథ్యంలో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సమయంలో అఽధికంగా బస్సులు కేటాయించాల్సింది పోయి.. సిద్ధం సభకు మళ్లించాలనుకోవడంపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండల్లో బస్సుల కోసం పడిగాపులు కాయాలా? ఆర్టీసీ అధికారులకు తమ కష్టాలు పట్టించుకోరా? అంటూ ధ్వజమెత్తుతున్నారు. దీనిపై జిల్లా ప్రజా రవాణా అధికారిని వివరణ కోరగా.. ఇప్పటివరకు అధికారికంగా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పుకొచ్చారు.

Updated Date - Apr 19 , 2024 | 11:31 PM