బ్రేక్ ఫెయిల్.. ఘాట్‌రోడ్డులో వ్యాన్ బోల్తా..
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:32 PM
సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్‌రోడ్డులో సోమవారం ఓ వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 24 మంది గిరిజనులు గాయపడ్డారు.

సీతంపేట మండలంలో ఘటన
సీతంపేట: సీతంపేట మండలం గెడ్డగూడ సమీపంలోని ఘాట్‌రోడ్డులో సోమవారం ఓ వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 24 మంది గిరిజనులు గాయపడ్డారు. పాండ్ర, కిండ్రువాడ గ్రామాలకు చెందిన సుమారు 50 నుంచి 60 మంది ఆదివాసీలు సోమవారం వేకువజామున మూడున్నర గంటల సమయంలో సీతంపేట వారకు సంతకు బయల్దేరారు. పాండ్రకు చెందిన పికప్ వ్యాన్‌పై వారంతా పయనమయ్యారు. సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారపు సంతలో తమ అటవీ ఉత్పత్తులు అమ్ముకుని.. కావాల్సిన నిత్యావసరాలను కొనుగోలు చేసుకుని తిరిగి స్వగ్రామాలకు చేరుకోవాలని అనుకున్నారు. అయితే మరో 15 నిమిషాల్లో సంతకు చేరుతారనగా.. వారి వాహనం బ్రేక్ ఫెయిలైంది. దీంతో ఘాట్‌రోడ్డు దిగుతున్న బండి ఒక్కసారిగా అదుపుతప్పి కుడివైపున ఉన్న కొండను ఢీకొట్టి బోల్తా పడింది. వ్యాన్‌లో ఉన్న వారంతా రక్త గాయాలతో చెల్లాచెదురుగా పడిపోయారు. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. స్థానికుల సమాచారంతో అక్కడి చేరుక్ను 108 వాహనం ద్వారా క్షతగ్రాతులను హుటాహుటిన సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి డాక్టర్ రాజేష్ వైద్య సేవలు అందించారు. ఆసుపత్రిలో సరిపడా వార్డులు లేకపోవడం, అప్పటికే మలేరియా బాధితులు, ఇతరత్రా రోగులు ఉండడంతో ఒకే మంచం మీద ఇద్దరేసి క్షతగాత్రులకు చికిత్స అందించారు. ఈ ఘటనలో 24 మంది వరకు గాయాలపాలవ్వగా, సవర లకో, కువ్వారి, గంగారావు, భూగన్న, సొంబురు, ఎల్లంగో, మాసయ్య, తిక్కమయ్య, తవుడు, జెర్మియలను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాలయాలైన వారికి సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై సీతంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తన సోదరుడు తోటపల్లి రిజర్వాయర్ మాజీ చైర్మన్ పాండురంగ, టీడీపీ మండల కన్వీనర్ సవర తోట ముఖలింగం తదితరులు ఆసుపత్రికి పంపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందివ్వాలని వైద్యులకు సూచించారు.
రెండు నెలలు.. మూడు ఘటనలు..
గత నెల 27న సీతంపేట మండలం వంబరవెల్లి, ఈనెల 10న కొమరాడ మండలం జల గ్రామ సమీపంలోని ఘాట్‌రోడ్డులో ఆటోలు లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఎంతోమంది గిరిజనులు గాయపడ్డారు. మరికొందరు మృతి చెందారు. తాజాగా సీతంపేట మండలంలో మరో ఘటన చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గెడ్డగూడ సమీపంలోని ఘాట్‌రోడ్డులో ఎడమవైపు వ్యాన్ బోల్తా పడి ఉంటే.. లోయలోకి వాహనం వెళ్లిపోయేదని, తీవ్ర ప్రమాదం సంభవించేదని గిరిజనులు చెబుతున్నారు. ఏదేమైనా సోమవారం వచ్చిందంటే సీతంపేట మండలంలో ఏదో ఒక ప్రాంతంలో రహదారి ప్రమాదాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, వాహనాలు నిర్వహణ సరిగా లేకపోవడమే ప్రమాదాలకు కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఘాట్‌రోడ్లపై రక్షణ గోడలు ఏర్పాటు చేసి.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.