బొత్స.. ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారా?
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:22 PM
నెల్లిమర్ల దన్నానపేటలో రోడ్డుపై ఆక్రమణ తొలగింపు విషయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

- దన్నానపేట ఘటనను రాజకీయంగా మాట్లాడడం సరికాదు
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం రూరల్, జూలై 28: నెల్లిమర్ల దన్నానపేటలో రోడ్డుపై ఆక్రమణ తొలగింపు విషయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొత్స వ్యాఖ్యలు ఆక్రమణలను ప్రోత్సహించేలా ఉన్నాయని మండిపడ్డారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దన్నానపేటలో ఆక్రమణల తొలగింపు కక్ష పూరితమని, జిల్లాలో ఎప్పుడూ ఇలాంటివి లేవంటూ బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘దన్నానపేటలో ఎంతోమంది ఎస్సీలు నివస్తున్న మూడు ఎకరాల భూమిని జగనన్న కాలనీ కోసం కేటాయించి పోలీసుల జోక్యంతో వారందరినీ అక్కడి నుంచి బలవంతంగా తరలించలేదా?. ఈ విషయాన్ని బొత్స మరచిపోయినట్లు ఉన్నారు. 2022లో దన్నానపేటలో రోడ్డుకి అడ్డంగా ఓ వ్యక్తి ప్రహరీ నిర్మించారని, దీనివల్ల ఇబ్బందిపడుతున్నామని ఆ గ్రామ ప్రజలు, రైతులు ఫిర్యాదు చేసినా గత సర్కారు తొలగించలేదు. తాజాగా మరోసారి ఆ గ్రామస్థులు, అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు. అందుకే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అక్రమ నిర్మాణాన్ని తొలగించాం. సొంత స్థలంలో నిర్మాణాలు చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. విజయవాడలో 2014లో టీడీపీ ఏర్పాటు చేసిన ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసింది. ఇది ఆక్రమణ కాదు. ప్రజలకు ఉపయోగపడే భవనం. అటువంటి భవనాన్ని కూల్చే సందర్భంలో మంత్రిగా ఉన్న బొత్స ప్రశ్నించారా?. దన్నానపేటలో జరిగిన అంశాన్ని రాజకీయంగా మాట్లాడడం ఘోరమని’ మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు.