Share News

జీవ వైవిధ్యం.. దైన్యం

ABN , Publish Date - May 22 , 2024 | 11:52 PM

ప్రకృతికి అనుబంధంగా మానవ జీవనం సాగితే అందం.. ఆనందం.. జీవ వైవిధ్యం. నేడు పర్యావరణానికి వ్యతిరేకంగా మనిషి అడుగులు పడుతున్నాయి. పర్యవసానంగా కరోనా వంటి తీవ్ర అపాయాన్ని మనిషి ఎదుర్కోవాల్సి వచ్చింది.

జీవ వైవిధ్యం.. దైన్యం

జీవ వైవిధ్యం.. దైన్యం

జిల్లాలో పెరగని చెట్ల పెంపకం

వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో అనేక పాట్లు

కొండ ప్రాంతాల్లో అడవి పందుల హననం

పశువులపై పులి దాడి

తెర్లాం మండలంలో జనంలోకి ఏనుగులు

నేడు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం

ప్రకృతికి అనుబంధంగా మానవ జీవనం సాగితే అందం.. ఆనందం.. జీవ వైవిధ్యం. నేడు పర్యావరణానికి వ్యతిరేకంగా మనిషి అడుగులు పడుతున్నాయి. పర్యవసానంగా కరోనా వంటి తీవ్ర అపాయాన్ని మనిషి ఎదుర్కోవాల్సి వచ్చింది. జీవ వైవిధ్యానికి దూరంగా వెళ్తే.. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ప్రయాణం సాగితే కలిగే దుష్పరిణామాలను ఊహించలేం. జిల్లాలో కొంతకాలంగా అనేక ఊహాతీత ఘటనలు జరుగుతున్నాయి. పశువులపై పులి దాడి.. తెర్లాం మండలంలో జనారణ్యంలో ఏనుగుల సంచారం.. చెట్లు మాయం అవుతుండడంతో అనూష్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు.. చెరువుల ఆక్రమణలు తదితర ఘటనలు ప్రజలను కలవర పెడుతున్నాయి. మనిషి మనుగడను దెబ్బతీసే ఇలాంటి పరిణామాలకు చెక్‌ పెట్టే ఉపాయాన్ని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. గురువారం ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జిల్లా పరిస్థితులపై కథనం.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొన్నాళ్లుగా ప్రకృతి హననం జరుగుతోంది. చెట్లు నరికేయడం.. నదులను ఇసుక తవ్వకాల పేరుతో విధ్వంసం చేయడం.. చెరువులు, గెడ్డలను ఆక్రమించడం.. అటవీ భూములను కబ్జా చేయడం.. తదితర ఘటనలు మనిషి మనుగడనే ప్రశ్నిస్తున్నాయి. వర్షాకాలంలో వస్తున్న వరదలకు ఈ తప్పులే కారణాలని పర్యావరణ వేత్తలు అనేకేళ్లుగా మొత్తుకుంటున్నారు. అయినా అవే తప్పులు జరుగుతూనే ఉన్నాయి. కబ్జాలు నిత్యకృత్యమైపోయాయి. పట్టణాల్లో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాల వల్ల వర్షం నీరు ఇళ్లపైకి వస్తోంది. రోడ్లను ముంచెత్తుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఏనుగుల సంచారం ఎప్పుడూ లేదు. ఉమ్మడి జిల్లాలో మాత్రం చూశాం. అయితే కొద్ది నెలల కిందట తెర్లాం మండలంలోకి ఏనుగుల గుంపు వచ్చి అలజడి సృష్టించాయి. ఒడిశాలోని లఖేరి అభయారణ్యం నుంచి పదేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాకు ఏనుగుల గుంపు వచ్చింది. ఇప్పటికీ మన్యం జిల్లాను వణికిస్తున్నాయి. అయితే కొద్ది నెలల కిందట తెర్లాం మండలంలోని రంగపువలస, తమ్మయ్యపేట ప్రాంతాల్లో ఏనుగులు సంచరించి పంటలను నాశనం చేశాయి. రంగపువలసలో ధాన్యం మిల్లుపై దాడి చేసి ధాన్యాన్ని ధ్వంసం చేశాయి. వరి నారుమడులను నాశనం చేశాయి. అలాగే వంగర మండలంలోని తలగాం గ్రామ పొలాల్లోనూ సంచరించాయి. ఇదిలా ఉండగా జిల్లాలో పెద్ద పులి సంచారం కూడా తీవ్రస్థాయిలో ఆందోళనకు గురిచేసింది. ఎస్‌.కోట, కొత్తవలస, మెంటాడ, బొండపల్లి, తెర్లాం, వంగర మండలాల్లో ప్రజలను భయాందోళనకు గురిచేసింది. బొండపల్లి మండలం పనసలపాడు గ్రామంలో ఆవులపై దాడి చేసి చంపేసింది. మెంటాడ మండలం బిరసాడవలసలోనూ సంచరించింది. మెంటాడ-అనంతగిరి మండల సరిహద్దుల్లో అవులపై దాడి చేసి చంపేసింది. ఇలా అనేక ఘటనలు జరిగాయి. ఏనుగులు, పులి సంచారానికి కారణం వాటి స్థలాల్లోకి మనిషి వెళ్లిపోవడమే. అటవీ భూముల్లో చెట్లు నరుక్కుంటూ పోవడంతో వన్యప్రాణులు, జంతువులు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇటు మైదాన ప్రాంతాల్లోనూ ప్రకృతిని కాపాడుకునే చర్యలు పెద్దగా కన్పించడం లేదు.

- విజయనగరం పట్టణంలో సుందరీకరణతో పాటు పర్యావరణ పరిరక్షణకోసం అంటూ చెట్లు నాటారు కాని సంరక్షణ మరిచారు. ఇటీవల నాటిన ఈతచెట్లలో ఒక్కటీ పచ్చగా కనిపించడం లేదు. కొన్ని నేలవాలాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వెంబడి రెండు వైపులా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. తర్వాత నిర్వహణ ఉండడం లేదు. దీంతో 80 శాతం మొక్కలు బతకడం లేదు.

- జిల్లాలోని నదులను విధ్వంసం చేస్తున్నారు. ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు. ఆఖరికి నదుల సహజ స్వరూపాన్ని మార్చేస్తున్నారు. ఫలితంగా వర్షాకాలంలో వరదలు సర్వసాధారణం అయ్యాయి. తీరం వెంబడి గ్రామాలను నదులు ముంచెత్తుతున్నాయి. పట్టణాల్లో రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా సాగడంతో వర్షం నీరు వెళ్లే మార్గం లేక రోజుల కొద్దీ నీరు రహదారులపై నిలిచిపోతోంది. విజయనగరంలోని మార్కెట్‌ పరిస్థితి ఇందుకో ఉదాహరణ.

- అటవీ విస్తీర్ణం 33శాతం ఉండాలన్నది నిబంధన. కాని ఉమ్మడి జిల్లాలో 23శాతానికి అటవీ విస్తీర్ణం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఏజెన్సీలో ఇస్టానుసారం పోడు వ్యవసాయం చేయడం.. అడవులను నరికి బొగ్గులు తయారు చేయడం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం లేదు.

- అటవీ ప్రాంతాల్లో అరుదుగా కన్పించే కింగ్‌ కోబ్రా జాతి పాములు కనుమరుగవుతున్నాయి. ఏప్రిల్‌.. మే నెలల్లో ఇవి ఎక్కువగా మక్కువ, సాలూరు మండలాల పరిధిలోని గెడ్డల పరివాహ ప్రాంతాలకు చేరి సంతానోత్పత్తి చేస్తుంటాయి. గత 20 ఏళ్లతో పోల్చితే ఈ అరుదైన పాములు కనుమరుగయ్యాయి. సంతానోత్పత్తి కోసం చల్లని ప్రదేశానికి వచ్చిన ఈ పాములు కొందరి దృష్టిలో పడి హతం అవుతున్నాయి.

- గుగ్గిలం అడవులు విస్తారంగా ఉండేవి. ఇవి రానురాను తగ్గిపోయాయి. మంచి కలప నిచ్చే చెట్లు కావటంతో ద్వారబందాలు, కిటికీలు, ఫర్నీచర్‌ వంటి వాటికోసం ఈ చెట్లను నరికేస్తున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో గుగ్గిలం చెట్లు విరివిగా కన్పించేవి.

=========

Updated Date - May 22 , 2024 | 11:52 PM