Share News

భగ..భగ

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:20 PM

జిల్లా భగభగ మండిపోతోంది. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 భగ..భగ
విజయనగరం రోడ్డులో జనసంచారం లేని దృశ్యం

- జిల్లాపై సూర్య ప్రతాపం

- ఎండకు ప్రజలు విలవిల

- జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

గజపతినగరం/ఎల్‌.కోట/వంగర, ఏప్రిల్‌ 5: జిల్లా భగభగ మండిపోతోంది. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు ఉక్కపోత, వడగాడ్పులతో అల్లాడిపోతున్నారు. జిల్లాలో శుక్రవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండ తీవ్రతకు ఉదయం నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన రహదారులపై జన సంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సమయపాలన లేకుండా విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు పని చేయక ప్రజలు మగ్గి పోతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రోగుల బాధలు వర్ణణాతీతం. రానున్న వారం రోజుల పాటు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని చెబుతున్నారు. వీలైనంత వరకు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగక పోవడం ఉత్తమం అని మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.సాయికృష్ణ తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

- ఎల్లప్పుడూ డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడం కోసం దాహం వేయక పోయినా తరచూ నీటిని తాగాలి.

- సమయానుగుణంగా ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌(ఓఆర్‌ఎస్‌)ను వినియోగించాలి.

- ఎక్కువగా మట్టి కుండ నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగిజావ, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్‌ నీటిని తాగాలి.

- మసాలా పదార్థాలు, వేపుళ్లు, పచ్చళ్లు, ఎక్కువ ఆయిల్‌ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోరాదు.

- నీటి సౌకర్యం ఉన్నవారు రెండుపూటలా తప్పకుండా స్నానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

- అన్ని వయస్సుల వారు వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. దీనివల్ల తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది.

- చిన్న పిల్లల ఒంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి గుడ్డతో తుడిచి బట్టలు మార్చాల్సి ఉంటుంది.

- ఈకాలంలో ముదురురంగు దుస్తులు వేసుకోక పోవడం ఉత్తమం.

- ఎండలోకి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీలు ధరించాలి. గొడుగులను వినియోగించాలి.

- వడదెబ్బకు గురైన వారు, తల తిరగడం, వాంతులు అయినట్లు లక్షణాలు ఉంటే తక్షణమే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలి.

జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు

-------------------------

ఎస్‌.కోట 43.6

జామి 43.6

గుర్ల 43.5

దత్తిరాజేరు 43.3

రాజాం 43.0

బాడంగి 42.9

రామభద్రపురం 42.9

సంతకవిటి 42.5

బొబ్బిలి 42.3

వేపాడ 42.2

ఎల్‌.కోట 42.2

వంగర 42.2

రేగిడి 42.2

గంట్యాడ 42.2

Updated Date - Apr 05 , 2024 | 11:20 PM