మౌలిక వసతులపై దృష్టి సారిస్తే మేలు...
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:05 PM
పార్వతీపురం ఐటీడీఏ పీవోగా సేదు మాధవన్ సోమవారం విధుల్లో చేరున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పార్వతీపురంలో ఏర్పాట్లు పూర్తి
పార్వతీపురం, జూలై 28(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పీవోగా సేదు మాధవన్ సోమవారం విధుల్లో చేరున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఇక్కడ పీవోగా పనిచేసిన విష్ణుచరణ్‌కు నంద్యాల జిల్లాకు జేసీగా బదిలీ అయ్యింది. ఆయన స్థానంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సేదు మాధవన్ రానున్నారు. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన పార్వతీపురం ఐటీడీఏ పీవోగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. మాధవన్ భార్య శోభిక ప్రస్తుతం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా నూతన పీవోపై గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు.
ఐటీడీఏ పరిధిలో ఉన్న అనేక గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేవు. తాగు, సాగునీటి వసతి అంతంతమాత్రమే. విద్య, వైద్యం సరేసరి. నేటికీ గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అత్యవసర వేళల్లో వారికి వైద్య సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో నూతన ఐటీడీఏ పీవో గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాల్సి ఉంది. గిరిజన గర్భిణుల వసతిగృహాల ద్వారా మెరుగైన సేవలు అందించాలి. వైటీసీల ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. మొత్తంగా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సి ఉంది.