Share News

చిరుద్యోగులకు ఎర!

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:13 AM

సార్వత్రి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొంతమంది అధికార పార్టీ నేతలు చిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. తమకు అండగా ఉంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో సహకరి స్తామని చెబుతున్నారు.

చిరుద్యోగులకు ఎర!

వివిధ శాఖల ఉద్యోగుల సమాచారం సేకరణ

వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 2 : సార్వత్రి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొంతమంది అధికార పార్టీ నేతలు చిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. తమకు అండగా ఉంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయిలో సహకరి స్తామని చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని అనేక మండలాల్లో గ్రామైక్య మహిళా సంఘాలు, మండల సమాఖ్య ప్రతినిధులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను ఆకట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మరో వైపు గ్రామస్థాయిలో అధికార పార్టీ నేతల నుంచి సంబంధిత చిరుద్యోగులు సమాచారం సేకరిస్తున్నారు.

తాయిలాలు అందిస్తూ..

- జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రస్తుతం రెండు పూటలా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఉపాధి క్షేత్ర సహాయకులను వైసీపీ నేతలు మచ్చిక చేసుకుంటున్నారు. ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించేలా వేతనదారులను చైతన్యపరచాలని ఇప్పటికే వారిని లోపాయికారికంగా కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఒక్కో ఉపాధి క్షేత్ర సహాయకునికి రూ.10 వేల చొప్పున ప్రత్యేక కవర్లలో ప్యాకింగ్‌ చేసి అందించినట్లు తెలిసింది. అధికార పార్టీకి అనుకూలకంగా ఉన్న క్షేత్ర సహాయకులకు ధైర్యం చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమ దేనని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో అప్రతమత్తంగా లేకుంటే తదుపరి చర్యలు తప్పవని మరికొంతమందిని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట ఓ నియోజకవర్గ నేత సంబంధిత క్షేత్ర సహాయకులతో సమావేశం నిర్వహించారు. వేతనదా రులను ఆకట్టుకొనే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. అయితే ఈ సమయంలో వారి నుంచి ముందుగానే సెల్‌ఫోన్లను తీసుకున్నారు.

- కొన్నిచోట్ల గ్రామైక్య మహిళా సంఘాలకు వైసీపీ నేతలు కొంతమేర నగదును అందించినట్లు సమాచారం. ‘జగన్‌ ప్రభుత్వంలోనే మహిళలకు పలు పథకాలు అందుతున్నాయి.. రెండో దఫా అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అందుతాయి.’ అని ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మహిళల ఓట్లు తమ పార్టీకే పడేలా చూడాలని, సహకారం అందించే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు.

- ప్రస్తుతం విధులకు దూరంగా ఉన్న గ్రామ వలంటీర్లకు రూ. 5 వేలు మేర తాయిలాలు అందించినట్లు సమాచారం. వైసీపీకి అనుకూలంగా లేని వారికి మాత్రం తాయిలాలు అందించలేదు. మొత్తంగా కొందరు వైసీపీ నేతలు నియోజకవర్గాల పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల చిరుద్యోగులను ఏదో ఒక రూపంలో తమ దారికి తెచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు ఉపాధి, మహిళా సంఘ ప్రతినిధులు (వెలుగు), వలంటీర్లకు తాయిలాలు అందిస్తున్నారు. వారిలో సహకరించే వారిపై ఒకలా, మాట వినని వారిపై మరోలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రలోభాలతోనే గెలుపునకు ప్రణాళికలు రూపొందిస్తున్న అధికార పార్టీ నేతలపై ఎన్నికల సంఘం దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:13 AM