Share News

తుప్పల్లో ఆడశిశువు

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:42 PM

తుప్పల్లో దొరికిన ఓ శిశువు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. తాను పెంచుకుంటానంటే తాను పెంచుకుంటానంటూ వాగ్వాదానికి దిగారు.

   తుప్పల్లో ఆడశిశువు
ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్న దృశ్యం

-కాపాడిన మహిళ

- పెంచుకునేందుకు వారి కుటుంబీకులకు అప్పగింత

-తనకూ కావాలని పట్టుబట్టిన మరో మహిళ

- వివాదం రేగడంతో శిశు గృహకు చిన్నారి తరలింపు

జామి, జూలై 5: తుప్పల్లో దొరికిన ఓ శిశువు కోసం ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. తాను పెంచుకుంటానంటే తాను పెంచుకుంటానంటూ వాగ్వాదానికి దిగారు. చివరకు ఈ విషయం ఐసీడీఎస్‌ అధికారులకు తెలిసింది. దీంతో శిశువును స్వాధీనం చేసుకుని శిశుగృహకు తరలించారు. అక్కడి నుంచి విజయనగరం ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జామి మండలం భీమసింగిలో చోటుచేసుకుంది. ఐసీడీఎస్‌ పీవో ఉమ, సూపర్‌వైజర్‌ కృష్ణవేణి, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 3వ తేదీ బుధవారం రాత్రి భీమసింగి-విజయనగరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న తుప్పల్లో నుంచి శిశువు ఏడుపు వినిపించింది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న నూడిల్స్‌ విక్రయించే మహిళ ఆ ఏడుపు విని తుప్పల్లో చూసింది. అక్కడ బొడ్డు తాడుతో ఉన్న ఆడ శిశువు కనిపించింది. వెంటనే చిన్నారిని బయటకు తీసి చుట్టుపక్కల వెతికింది. ఎవరూ కనిపించక పోవడంతో ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి ఆవుపాలు పట్టింది. ఎంతో కాలంగా పిల్లలు లేని తమ కుటుంబీకులు ఉన్న కేఎల్‌పురం వెళ్లి వారికి శిశువును అప్పగించింది. దీంతో వారు ఎంతో ఆనందపడ్డారు. అయితే, ఈ విషయం భీమసింగి గ్రామంలో వ్యాపించడంతో ఆ గ్రామానికి మరో మహిళ ఆటోలో కేఎల్‌పురం వెళ్లి తనకు ఆ పిల్లను ఇచ్చేయాలని కోరింది. తమ గ్రామంలో దొరికిన బిడ్డ తమకే చెందుతుందని, తామే పెంచుకుంటామని చెప్పింది. దీనికి వారు నిరాకరించారు. దీంతో చిన్నపాటి వివాదం నడిచింది. దీంతో ఆ నోటా ఈ నోటా గురువారం ఉదయం ఈ విషయం ఐసీడీఎస్‌ అధికారులకు తెలిసింది. పీవో ఉమ ఆదేశాలతో సూపర్‌వైజర్‌ కృష్ణవేణి, అంగన్‌వాడీ కార్యకర్తలు కేఎల్‌పురం వెళ్లి శిశువును ఇచ్చేయాలని కోరారు. దీనికి వారు ససేమీరా అనడంతో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. బిడ్డ పుట్టుకకు ఆధారాలు ఉంటే వ్యాక్సిన్‌లు వేయడం.. వైద్యసేవలు అందించడం జరుగుతుందని నచ్చజెప్పడంతో బరువెక్కిన గుండెతో ఆ శిశువును అధికారులకు అప్పగించారు. గురువారం సాయంత్రం ఆటోలో విజయనగరం శిశు గృహకు తీసుకెళ్లి రికార్డులో నమోదు చేశారు. అనంతరం ఘోషా ఆసుపత్రికి తరలించారు. పాప బరువు తక్కువగా ఉండటంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. దీంతో చిన్నారి కోలుకుంటుంది.

Updated Date - Jul 05 , 2024 | 11:42 PM