రాజులగుమ్మడలో ఆటో-బస్సు ఢీ
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:18 AM
రాజులగుమ్మడ సమీపంలో సోమవారం సాయంత్రం ఆటో, బస్సు ఢీకొని 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులది శివ్వాం గ్రామం. పొలం పనులు ముగించుకని ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాజులగుమ్మడలో
ఆటో-బస్సు ఢీ
- 15 మందికి గాయాలు
- పొలం పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఘటన
- బాధితులది శివ్వాం గ్రామం
వంగర, ఫిబ్రవరి 5: రాజులగుమ్మడ సమీపంలో సోమవారం సాయంత్రం ఆటో, బస్సు ఢీకొని 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులది శివ్వాం గ్రామం. పొలం పనులు ముగించుకని ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శివ్వాంకు చెందిన కూలీలు ప్రతీరోజు చెరుకు కటింగ్ పనులకు రాజులగుమ్మడ వెళ్తున్నారు. రోజూలాగే ఆటోలో వెళ్లి సోమవారం సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఇంకా గ్రామం దాటనే లేదు. అంతలోనే రాజాం నుంచి రాజులగుమ్మడ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ దాటికి ఆటో బోల్తాకొట్టింది. లోపల కూర్చొన్న కూలీలంతా ఒక్కసారిగా చెల్లాచెదురుగా పడిపోయారు. కొందరు లేవలేని పరిస్థితిలో ఆర్తనాదాలు చేశారు. క్షతగాత్రుల్లో కలమట రత్నాలు, ముంజు రమణమ్మ, పల్లి శంకరరావుకు తీవ్రగాయాలయ్యాయి. గెదెల నాగమణి, ఎన్.శంకర్, ఎ.కృష్టవేణి, కె.శాంతి, బలగ తవుడమ్మ, గెదెల లప్పలనర్శమ్మ, జి.భద్రం, తుమ్మిడి గౌరు, బలగ లక్ష్మీలకు గాయాలయ్యాయి. ఆటోలో ఉన్నవారందరికీ గాయాలు తగిలాయి. రాజాం, రేగిడి, వంగరకు చెందిన 108 వాహనాల్లో క్షతగాత్రులను రాజాం ప్రైవేటు అసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ శ్రీకాకుళం తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.
బాధితులంతా కూలీలే. రాజాం సీఐ శ్రీనువాసరావు అసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను విచారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రుమురళీమోహన్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. బస్సు ముందుభాగం దెబ్బతింది.