Share News

అనుకున్నదొక్కటి..

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:00 AM

ప్రభుత్వ పథకాలు ఎవరెవరికి రావాల్సి ఉందో వలంటీర్లను అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది. పంచాయతీలో ఎవరికైనా సమస్యలుంటే వలంటీర్లకే చెబుతున్నారు. మా దగ్గరకు ఎవరూ రావడం లేదు. పేరు మాది.. పనులు వారివి.

అనుకున్నదొక్కటి..

అనుకున్నదొక్కటి..

ప్రభుత్వంపై స్థానిక ప్రజాప్రతినిధుల్లో తీవ్ర నిరాశ

ప్రజల్లో గుర్తింపు లేదని ఆవేదన

రూ.లక్షలు ఖర్చు చేసి గెలిచినా వలంటీర్లదే హవా అని నిట్టూర్పూ

లక్షల రూపాయలు ఖర్చుచేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచాం. జగన్‌ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేసుకుంటే సర్పంచ్‌ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు మొత్తం ఐదేళ్లలో రికవరీ అవుతుంది. ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని అనుకున్నాం. కానీ సీన్‌ రివర్స్‌ అయింది. గ్రీన్‌ అంబాసిడర్లకు కూడా సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

- ఎస్‌.కోట నియోజకవర్గంలోని ఓ సర్పంచి ఆవేదన

--------

ప్రభుత్వ పథకాలు ఎవరెవరికి రావాల్సి ఉందో వలంటీర్లను అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది. పంచాయతీలో ఎవరికైనా సమస్యలుంటే వలంటీర్లకే చెబుతున్నారు. మా దగ్గరకు ఎవరూ రావడం లేదు. పేరు మాది.. పనులు వారివి.

- నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని ఓ సర్పంచి నిరాశ

విజయనగరం (ఆంధ్రజ్యోతి)

పంచాయతీ ఎన్నికల్లో రూ.కోట్లలో ఖర్చుచేసి సర్పంచులైన వారు జిల్లాలో ఉన్నారు. మరికొన్ని చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవిని పొందేందుకు గ్రామాభివృద్ధికి రూ.లక్షల్లో డబ్బులు ఇచ్చారు. సర్పంచ్‌ పదవి ద్వారా కాంట్రాక్టు పనులు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల నుంచి భారీగా కమీషన్‌లు, అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల యావపై ఎలాగైనా సర్పంచులు అవ్వాలన్న ఉత్సుకతతో పదవిని అలంకరించిన వారూ ఉన్నారు. ఎన్నికయ్యాక సీన్‌ రివర్స్‌ అయింది. వారు అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా ఆర్థిక సంఘం నిధులను కూడా లాక్కుంది. పంచాయతీ ఖాతాలో జమైన నగదు సర్పంచ్‌లకు తెలీకుండానే మాయం అయిపోయేది. తిరిగి నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వంపై తీవ్ర నిరాశతో ఉన్నారు. గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కొన్ని పంచాయతీలు ఉన్నాయి. మంచినీటి రిజర్వాయర్ల నిర్వహణ, కాలువల్లో పూడికతీత, దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు కూడా నిధులు చాలని దుస్థితి చాలా గ్రామాల్లో కనిపిస్తోంది. దీంతో ప్రజల్లో సర్పంచ్‌లు చులకన అయిపోతున్నారు. కుర్చీలో కూర్చున్నది మొదలు ఇప్పటివరకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక సర్పంచులు బయటకు రావడం లేదు. వచ్చినా ప్రజల వద్దకు వెళ్లడం లేదు.

- గ్రామంలో పథకాలు అందకుంటే ఇదివరకు సర్పంచ్‌ వద్దకు వచ్చి చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా వలంటీర్లే. దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పాత్రే లేకుండా పోయింది. ఏం కావాలన్నా వలంటీర్ల వద్దకు వెళ్తున్నారు. గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవం లేకుండా పోయిందనేది వారి ఆవేదనగా ఉంది. గ్రామానికి అన్నీ తామై అభివృద్ధి చేయాలనుకున్న సర్పంచ్‌ల కళ కలగా మిగిలిపోయింది. దీంతో జగన్‌ ప్రభుత్వ తీరుపై వారు అన్ని రకాలుగా గుర్రుగా ఉన్నారని తెలిసింది.

రామభద్రపురం: రామభద్రపురం బైపాస్‌ వద్ద రాజాం వైపు వెళ్లే ఈ బీటీ రోడ్డు గోతులమయమైంది. పూర్తిగా పాడైంది. కొన్నేళ్లుగా నిర్వహణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట అటుగా వాహనాలపై వెళ్లేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు. నేతలకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు శూన్యం.

---------

Updated Date - Mar 28 , 2024 | 12:00 AM