Share News

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:00 AM

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు ఆదేశించారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

- జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు

పార్వతీపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పరీక్షల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడపాలని ప్రజా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. రైల్వేగేట్లు ఉన్న గ్రామాల నుంచి విద్యార్థులు ముందుగా బయలుదేరేలా చూడాలన్నారు. పరీక్షలు జరిగినన్ని రోజులూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. కేంద్రాల వద్ద మెడికల్‌ క్యాంపులతో పాటు 144 సెక్షన్‌ అమలు చేయాలని, ఎస్కార్ట్స్‌, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారిణి డి.మంజులవీణ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌, మార్చి 1 నుంచి 20 తేదీ వరకు రాత పరీక్షలు జరుగుతా యని తెలిపారు. మొత్తం 17,268 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. 32 పరీక్ష కేంద్రాలు, 14 స్టోరేజ్‌ పాయింట్లు, జిల్లా కేంద్రంలో స్ర్టాంగ్‌రూం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పీవీవీఎస్‌ఎన్‌ కృష్ణమూర్తి, కలెక్టరేట్‌ డిసెక్షన్‌ సూపరింటెండెంట్‌ ఎం.రమణమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:00 AM