Share News

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌?

ABN , Publish Date - May 21 , 2024 | 11:11 PM

జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. కోట్లాది రూపాయల ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం ప్రభుత్వం పెండింగ్‌ పెట్టడంతో సేవలను ఆపివేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి.

ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌?

- నేటి నుంచి నిలిపివేస్తామని ప్రకటించిన ప్రైవేట్‌ ఆస్పత్రులు

- ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే కారణం

- ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. కోట్లాది రూపాయల ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం ప్రభుత్వం పెండింగ్‌ పెట్టడంతో సేవలను ఆపివేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, సాలూరు పరిధిలో నాలుగు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. అయితే, కోట్లాది రూపాయల బిల్లులు ఈ ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి సుమారు రూ.2 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మిగిలిన ఆసుపత్రులకు కూడా కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో బుధవారం నుంచి సేవలు నిలిపివేస్తామని చేసిన హెచ్చరికతో ఆరోగ్య శ్రీ కొనసాగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ముందు తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని సంబంధిత యజమానులు కోరినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో బిల్లులు చెల్లింపులు జరుగుతుతాయా? లేదా? అన్న సందేహం నెలకొంది. ఏదిఏమైనా ఆరోగ్య శ్రీ సేవలకు ఎటువంటి బ్రేక్‌ పడకుండా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 21 , 2024 | 11:11 PM