Share News

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

ABN , Publish Date - May 23 , 2024 | 11:09 PM

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలని, ప్రతి ఒక్కరూ అప్రమ్తతంగా ఉండి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, డీటీలు, నోడల్‌ అధికారులకు ఓట్ల లెక్కింపుపై గురువారం మొదటి విడత శిక్షణ నిర్వహించారు.

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

ఉదయం 8 గంటలకు ప్రారంభం

ఒక వైపు ఈవీఎం ఓట్లు .. మరోవైపు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌, మే 23: ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలని, ప్రతి ఒక్కరూ అప్రమ్తతంగా ఉండి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, డీటీలు, నోడల్‌ అధికారులకు ఓట్ల లెక్కింపుపై గురువారం మొదటి విడత శిక్షణ నిర్వహించారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. లెక్కింపు ప్రక్రియ మొత్తం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. చిన్న పొరపాటుకు కూడా తావివ్వద్దని, ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కేటాయించిన విధులను పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియపై అందరూ సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అందువల్ల సిబ్బంది 6 గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకుని అన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

లెండి కళాశాలలో ఎంపీ పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలకు అనుమతి లేదని కలెక్టర్‌ సృష్టం చేశారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఒకేసారి జరుగుతుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు అధిక సంఖ్యలో పోలైనందన, లెక్కింపు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విజయనగరంలో పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మాత్రం లెండి కళాశాలలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం 20 టేబుళ్లతో పెద్ద హాలును సిద్ధం చేస్తున్నామన్నారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో హాలులో 14 టేబుళ్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి గదిలో సిసి టివి ఉంటుందని, ఈవిఎంలు తీసుకువచ్చిన దగ్గర నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ వీడియో రికార్డింగ్‌ కూడా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డును ధరించాలని, అవి లేకపోతే లోపలికి అనుమతించేది లేదని చెప్పారు. కౌంటింగ్‌ హాలులో రిటర్నింగ్‌ అధికారులదే సర్వాధికారమని, వారే పూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. కౌంటింగ్‌ సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్‌, డీఆర్‌వో అనిత తదితరులు ఉన్నారు.

భద్రత కట్టుదిట్టం: ఎస్పీ దీపిక

విజయనగరం క్రైం: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని ఎస్పీ దీపిక ఆదేశించారు. వచ్చేనెల 4న ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించే జేఎన్‌టీయు, లెండి ఇంజనీరింగ్‌ కళాశాలల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె జిల్లా పోలీస్‌ అధికారులతో గురువారం సమీక్షించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని, రూప్‌టాప్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ రెగ్యులరైజేషన్‌, వాహనాల పార్కింగ్‌నకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లే కౌంటింగ్‌ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రిటర్నింగ్‌ అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించాలన్నారు. రిటర్నింగ్‌ అఽధికారులు, సూపర్‌వైజర్లు మినహా ఇతరుల మొబైల్స్‌ కేంద్రాలకు అనుమతించవద్దన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాలను బాంబు డిస్పోజర్‌ బృందాలతో తనిఖీలు చేయాలన్నారు. మహిళలను తనిఖీ చేసేందుకు మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలన్నారు. ఫలితాలు వెల్లడైన తరువాత ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పెట్రోలింగ్‌ నిర్వహించాలని అన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఏఎస్‌పీ ఆష్మాపరహీన్‌, ట్రైనీ ఐపీఎస్‌ మండా జావలి అల్ఫాన్స్‌, డీఎస్పీలు గోవిందరావు, శ్రీనివాసరావు, ఏఎస్‌ చక్రవర్తి, విశ్వనాథ్‌, వీరకుమార్‌, యూనివర్స్‌, ట్రైనీ డీఎస్పీ మహేంద్ర, సీఐలతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:09 PM