అవి పులి పాదముద్రలేనా?
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:11 AM
tiger footprints;శివరాంపురం గ్రామ పొలాల్లో గురువారం ఓ జంతువుకు సంబంధించిన పాదముద్రలు కనబడ్డాయి. ఈ పాదముద్రలు పులికి చెందినవేనని రైతులు బెంబేలెత్తుతున్నారు.

సాలూరు రూరల్, డిసెంబరు 26: శివరాంపురం గ్రామ పొలాల్లో గురువారం ఓ జంతువుకు సంబంధించిన పాదముద్రలు కనబడ్డాయి. ఈ పాదముద్రలు పులికి చెందినవేనని రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో పులి సంచారించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మళ్లీ పులి వచ్చిందేమోనని రైతులు భయపడుతున్నారు. ఉదయాన్నే తన పొలానికి వెళ్లిన కరిబుగత సత్యనారాయణ అనే రైతుకు గట్టుపై ఓ జంతువు పాదముద్రలు కన్పించాయి. ఆ జంతువు వేగవతి నది వైపు వెళ్లినట్టు పాదముద్రలు ఉన్నాయి. నీళ్లు తాగడానికి చిన్న జంతువులు వస్తే, వాటిని వేటాడానికి అటుగా పులి వెళ్లి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే, అవి పులి పాదముద్రలు కావని అటవీశాఖ సాలూరు రేంజర్ కాళ్ల తవిటినాయుడు తెలిపారు. గతంలో పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరించిన పులి ట్రాకింగ్ విషయమై తాను చొరవ చూపానని అన్నారు. పులి పాదముద్రలు వేరేలా ఉంటాయన్నారు. ఈ పాదముద్రలు ఫిషింగ్ క్యాట్ లేదా తోడేలు తరహా జంతువులవి అయి ఉంటాయన్నారు. శివరాంపురం, పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందవద్దని కోరారు.