Share News

అప్పిచ్చి.. ఆస్తులు లాగేస్తారు

ABN , Publish Date - May 03 , 2024 | 12:34 AM

అడుక్కునే వాడి నుంచి.. చిరు వ్యాపారి వరకూ.. అందరికీ అప్పులిచ్చి ఆస్తులను లాక్కోవడం ఎమ్మెల్యే కోలగట్ల నైజమని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.

అప్పిచ్చి.. ఆస్తులు లాగేస్తారు
: విజయనగరంలో మాట్లాడుతున్న బాలకృష్ణ

అప్పిచ్చి.. ఆస్తులు లాగేస్తారు

కోలగట్లను ఉద్దేశించి బాలకృష్ణ పరోక్ష విమర్శ

ఉత్తరాంధ్రకు బొత్స, ధర్మాన చేసిందేమిటని ప్రశ్న

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ విజయనగరం రూరల్‌, మే 2: అడుక్కునే వాడి నుంచి.. చిరు వ్యాపారి వరకూ.. అందరికీ అప్పులిచ్చి ఆస్తులను లాక్కోవడం ఎమ్మెల్యే కోలగట్ల నైజమని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. విజయనగరంలోని గంటస్తంభం వద్ద స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరిట గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అప్పు, తాకట్టు, వడ్డీ, కబ్జాలతో దోచుకుంటున్నారని కోలగట్లపై విరుచుకుపడ్డారు. పేకాట, మద్యం, ఆశ్లీల నృత్యాలు తదితర వాటిని కూడా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మార్కెట్‌లు, థియేటర్లపై పడి దందాలు చేసి వసూలు చేస్తున్నారన్నారు. బొత్స, ధర్మాన, తమ్మినేని, అవంతి, గుడివాడ అమర్‌ తదితర కుటుంబాలు 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. సొంత అభివృద్ధి మినహా, రోడ్లపై వున్న గోతుల్లో మట్టి అయినా పోశారా? అని ప్రశ్నించారు. సీసీ రోడ్లు, డ్రైన్లు, రహదారులు ఏవీ అభివృద్ధి చేయలేదన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును, మన భవిష్యత్‌ తరాల రాతను మార్చేవని చెప్పారు. సరైన అభ్యర్థులకు ఓటేయాలన్నారు. జగన్‌ మళ్లీ వస్తే రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోయే పరిస్థితి వస్తుందన్నారు. అవ్వతాతలకు అందించే పెన్షన్‌ల విషయంలో ఇబ్బందులకు గురిచేసి నోటి దగ్గరి కూడును లాగేస్తున్నారన్నారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అరాచకమేనన్నారు. అశోక్‌ గజపతిరాజు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారని, ఎన్నో పదవులు అలంకరించారని, ఏనాడూ నీతినిజాయితీలను వీడలేదన్నారు.

జై బాలయ్య నినాదాల హోరు

స్వర్ణంధ్ర సహకార యాత్రలో భాగంగా గురువారం విజయనగరం వచ్చిన సినీన టుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు విజయనగరం వాసులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చీపురుపల్లిలో సభ ముగించుకుని ఆయన విజయనగరం వచ్చినప్పుడు నగరంలోని రాజారావు మేడ జంక్షన్‌ (సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌) వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడమే కాకుండా ఆయనపై పూలవర్షం కురిపించారు. టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి అదితి గజపతిరాజు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అక్కడి నుంచి బాలకృష్ణతో పాటు రోడ్‌ షోలో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు ఆదరణతో కర్రల మార్కెట్‌ వరకూ రోడ్‌ షో కొనసాగింది. రోడ్‌షో ముందు బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు కాగిత శ్రీనివాస్‌, కనకల మన్మధల ఆధ్వర్యంలో నందమూరి అభిమానులు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. జై బాలయ్య అంటూ నినాదాలతో విజయనగరం హోరెత్తింది.

ప్రతి తలపైనా రూ.10 లక్షల రుణ భారం: బాలకృష్ణ

చీపురుపల్లి, మే 2: రాష్ట్రంలోని వైసీపీ పాలన పుణ్యమా అని ప్రతిఒక్కరూ తమ తలపై పది లక్షల రూపాయలకు పైగా రుణ భారం మోస్తున్నారని హిందూపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ చలవతోనే ఈ భారం పడిందన్నారు. దీనినుంచి విముక్తి పొందాలన్నా, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నా వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేయాలని ఆయన కోరారు. చీపురుపల్లి పట్టణంలోని మెయిన్‌ రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత ఎన్టీఆర్‌దే అన్నారు. ఆయన వారసునిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలు గతంలో అమలు చేశారని, జీరో బడ్జెట్‌లో కూడా పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. ప్రతి వ్యక్తి తలపై పది లక్షల రుణం ఉందన్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరగలేదని, విదేశీ విద్య పథకం అమలు కావడం లేదని, ఈ ప్రాంతంలోని రైతులకు తోటపల్లి ప్రాజక్టు ద్వారా సాగు నీరు అందడం లేదని సమస్యలను ప్రస్తావించారు. చీపురుపల్లి పరిసర ప్రాంతాలకు విద్యుత్‌ను అందించే ఆర్‌ఈసీఎస్‌ను మూసివేశారన్నారు. ఆ సంస్థలో ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో జరిగే ప్రతి పనికీ పాలకులకు వాటా ఇవ్వవలసిందేనన్నారు. ఇటువంటి నాయకుల్ని ఇంటికి పంపించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఉత్తమ పాలన కోసం కూటమి అభ్యర్థులుగా ఉన్న కిమిడి కళావెంకటరావును ఎమ్మెల్యేగా, కలిశెట్టి అప్పలనాయుడును ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. సభలో కూటమి అభ్యర్థులు కిమిడి కళావెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి నాగార్జున, గద్దే బాబూరావు, త్రిమూర్తులరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:34 AM