ఎవరెక్కడో?
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:36 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులకు స్థానచలనం కల్పించారు. వారిలో కొందరికి పోస్టింగులు ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన జిల్లా అధికారులకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది.

ఇతర జిల్లాల నుంచి మన్యం వచ్చేందుకు యత్నాలు
ఎక్కడ పోస్టింగ్ ఇస్తారోనని ఇక్కడున్న వారిలో ఆందోళన
వైసీపీ సర్కారుతో అంటకాగిన వారు జిల్లాకు వద్దంటున్న కూటమి శ్రేణులు
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)
టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులకు స్థానచలనం కల్పించారు. వారిలో కొందరికి పోస్టింగులు ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి.. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన జిల్లా అధికారులకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. తమను ఎక్కడకి బదిలీ చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా పొరుగు జిల్లాలకు వెళ్లిన వారు సైతం తిరిగి మన్యానికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు తమకున్న పరిచయాలతో పైరవీలు సాగిస్తున్నారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు కులం కార్డును ఉపయోగిస్తున్నారు.
సొంత జిల్లాలకు వెళ్లేందుకు..
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత వివిధ శాఖలకు చెందిన కొంతమంది అధికారులు ఇతర జిల్లాల నుంచి పదోన్నతులపై ఇక్కడకు వచ్చారు. మరికొంతమంది సాధారణ బదిలీలపై వచ్చారు. వీరంతా తమ జిల్లాలకు దగ్గర్లో లేదా సొంత జిల్లాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా.. లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు టెన్షన్ పడుతున్నారు. తమకు కావాల్సిన స్థానం దొరుకుతుందా.. లేదా? అని మథనపడుతున్నారు. జిల్లాలో ఒక కీలక శాఖకు చెందిన అధికారి ఇతర జిల్లా నుంచి బదిలీపై వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. తన సొంత జిల్లాకే ట్రాన్స్‌ఫర్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. అయితే ఒకవేళ బదిలీ కాకపోతే తన పరిస్థితేమిటో అర్థం కావడం లేదని తన సహోద్యుగుల దగ్గర వాపోయారు. మరో శాఖకు చెందిన అధికారి విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బదిలీల్లో తిరిగి ఆయన్ని పార్వతీపురం వేస్తారా లేక విజయనగరంలో కొనసాగిస్తారా.. లేకుంటే ఇతర జిల్లాలకు పంపిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
కొంతమంది తహసీల్లార్లు ఇలా..
జిల్లాలోని 15 మండలాలకు చెందిన తహసీల్దార్లు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. అయితే మరికొన్నిరోజుల్లో వారు సొంత జిల్లాకు రానున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయా తహసీల్దార్లు రిపోర్టు చేసిన తర్వాత... వారికి కేటాయించిన మండలాలకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఇతర జిల్లాల్లో ఉన్న తహసీల్దార్లు అక్కడ ఉంటుండగానే జిల్లాలో పనిచేసేందుకు, తమ అనుకూలమైన స్థానం కోసం పైరవీలు ప్రారంభించారు. దీంతో ఏ తహసీల్దార్ ఎక్కడికి వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
వైసీపీ కార్యకర్తల్లా..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేమంది తహసీల్దార్లు ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారు. మండల మేజిస్ర్టేట్ స్థాయి ఉన్న కొంతమంది వైసీపీకి అనుకూలంగానే పనిచేశారు. ఎన్నికల విధుల్లో భాగంగా వారు ఇతర జిల్లాలకు వెళ్లినా.. ఏ మాత్రం మారలేదు. గతంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు కార్యాలయంలోకి వచ్చినా పట్టించుకోని పరిస్థితి.. మరికొంతమంది తహసీల్దార్లు గత ఐదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా నడుచుకునేవారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు చెప్పిందే చేసేవారు. నిబంధనలను ఏ మాత్రం పట్టించుకునే వారు కాదు. అయితే ఇటువంటి తహసీల్దార్లు తిరిగి వారికి అనుకూలమైన స్థానాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం. కొంతమంది తహసీల్దార్లు కులాన్ని అడ్డం పెట్టుకొని.. వారి సంఘ పెద్దలతో చెప్పిస్తున్నట్లు తెలిసింది. ఇంకొందరు ఇతర జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొని వచ్చి.. వారికి కావాల్సిన స్థానాల కోసం పైరవీలు చేస్తున్నారు.
వారిని దూరంగా ఉంచాలి..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం టీడీపీ కార్యకర్తలు, నాయకులను గౌరవించకుండా ఆ పార్టీ నేతలు చెప్పిందే చట్టంగా పనిచేసిన కొంతమంది తహసీల్దార్లను దూరంగా ఉంచాలని నాలుగు నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలను కోరుతున్నారు. వైసీపీ మూలాలున్న తహసీల్దార్‌కు జిల్లాలో పోస్టింగ్‌లు ఇస్తే.. వారు మళ్లీ వైసీపీ నేతలతో జత కలిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పరిస్థితి ఉందని ద్వితీయ శ్రేణి నాయకులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ప్రకారం పనిచేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని, మిగిలిన వారికి కలెక్టరేట్ లేదా సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని కొంతమంది టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కొంతమంది ఎంపీడీవోలు ఇలా..
గత ఐదేళ్లలో జిల్లాలో కొందరు ఎంపీడీవోలు వైసీపీతో అంటకాగారు. కొంతమంది వైసీపీ నాయకులకు అనుకూలంగా పనిచేశారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను కనీసం పట్టించుకోలేదు. కొన్ని మండలాల్లో వారి న్యాయమైన సమస్యలను కూడా పరిష్కరించలేదు. ఇదిలా ఉండగా గతంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రస్తుతం ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు తిరిగి పార్వతీపురం మన్యం జిల్లాలో పోస్టింగ్‌ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటువంటి ఎంపీడీవలోపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, తమ మండలాలకు వారు వద్దని కొంతమంది టీడీపీ కూటమి నాయకులు బహిరంగంగానే ఎమ్మెల్యేలకు స్పష్టం చెబుతున్నారు.