Share News

ఏదీ ధరల స్థిరీకరణ?

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:10 AM

‘అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే మద్దతు ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. దళారుల ప్రమేయం ఉండదు. వ్యాపారుల కృత్రిమ కొరత ఉండదు. రైతులు, వినియోగదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.’ అని గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో సీఎం జగన్‌ ప్రకటించారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టి ఐదేళ్లు గడిచినా.. ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాల్లేవు.

ఏదీ ధరల స్థిరీకరణ?

ఐదేళ్లు గడిచినా.. కనీస ప్రయత్నాల్లేవ్‌..

షాకిస్తున్న బియ్యం ధరలు

నియంత్రణకు చర్యలు శూన్యం

ఆందోళనలో జిల్లావాసులు

కొమరాడ, ఏప్రిల్‌ 12 : ‘అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే మద్దతు ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది. దళారుల ప్రమేయం ఉండదు. వ్యాపారుల కృత్రిమ కొరత ఉండదు. రైతులు, వినియోగదారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.’ అని గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో సీఎం జగన్‌ ప్రకటించారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టి ఐదేళ్లు గడిచినా.. ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాల్లేవు. రోజురోజుకూ నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా.. కనీస చర్యల్లేవు. దీంతో ఐదేళ్ల పాలనలో వాటి ధరలు ఎంతగా పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బియ్యం ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. బయట మార్కెట్లో వాటిని కొనుగోలు చేయాలంటేనే.. హడలెత్తిపోతున్నారు. వాస్తవంగా ఇంటింటికి రేషన్‌ పంపిణీలో భాగంగా మేలు రకం బియ్యం పంపిణీ చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రేషన్‌కార్డులో ఉన్న ఒక్కొక్కరికీ నెలకు 10 కేజీల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నగదు నిండుకోవడంతో ఏడాదిన్నరగా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బియ్యం అందించడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని మాత్రమే అందిస్తోంది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల వద్ద కిలో బియ్యాన్ని రూ.42కు కొనుగోలు చేసి పేదలకు రూపాయికే బియ్యం ఇవ్వాలి. అయితే అప్పులతో నడుస్తున్న సర్కారు బియ్యం భారం మేయలేక చేతులెత్తేసింది. దీంతో కేంద్ర సర్కారు అందిస్తున్న బియ్యాన్నే ఉచితంగా పంపిణీ చేస్తూ.. ఇదంతా తమ గొప్పతనమే అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కాగా ప్రతినెలా ఐదు కేజీల చొప్పున అందించే రేషన్‌ బియ్యం ఎటూ చాలకపోవడంతో సామన్య ప్రజలు బయట మార్కెట్లోనే బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే 26 కిలోల సోనా మసూరీ బియ్యం బస్తా ధర రూ. 1100 నుంచి ఏకంగా రూ. 1600కు పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి వర్గీయులు షాక్‌కు గురువుతున్నారు. ఆ ధరలను చూసి వణికిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ స్థోమతకు తగ్గట్లుగా ఆ బియ్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ వారిపై ప్రతినెలా అదనపు భారం పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బియ్యం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

భరించలేకపోతున్నాం..

బియ్యం ధరలను భరించలేకపోతున్నాం. గతంలో కన్నా భారీగా పెరిగాయి. మా లాంటి పేదలు బయట మార్కెట్లో కొనుగోలు చేయలేకపోతున్నారు. బియ్యం ధరల నియంత్రణకు అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.

- డి.లక్ష్మి, వ్యవసాయ కూలి, పెదఖేర్జల, కొమరాడ మండలం

Updated Date - Apr 13 , 2024 | 12:10 AM