Share News

‘ గిరి ప్రోత్సాహం’ ఏదీ?

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:19 PM

‘నా ఎస్టీలు.. నా ఎస్సీలు .. అంటూ పదే పదే చెప్పుకునే సీఎం జగన్‌ ఐదేళ్ల పాలనలో మాత్రం ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. ప్రధానంగా గిరిజనుల అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు.

 ‘ గిరి ప్రోత్సాహం’ ఏదీ?
పూతికవలస ఆశ్రమ పాఠశాల

పారిశుధ్య సేవలు, వేసవి శిక్షణ శిబిరాలకు నిధులు కేటాయించని సర్కారు

టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు

వైసీపీ పాలనలో మంగళం

(సీతంపేట)

‘నా ఎస్టీలు.. నా ఎస్సీలు .. అంటూ పదే పదే చెప్పుకునే సీఎం జగన్‌ ఐదేళ్ల పాలనలో మాత్రం ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరించారు. ప్రధానంగా గిరిజనుల అభివృద్ధికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు మంగళం పాడేశారు. పైగా గిరిపుత్రుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటనలతో ఊదరగొట్టారు. దీంతో జిల్లా పరిధిలో ఏజెన్సీ వాసులు మండిపడుతున్నారు. వైసీపీ సర్కారు తీరుపై పెదవి విరుస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు గిరి ప్రోత్సాహం కింద రూ.500 అందజేసేవారు. దసరా పండగ సెలవుల అనంతరం ఒకటి, రెండు రోజుల్లో పాఠశాలలకు తిరిగి రావడానికి వీలుగా గిరి ప్రోత్సాహం పథకాన్ని 2017లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. గిరిజన విద్యార్థుల డ్రాపౌట్స్‌ తగ్గించాలని ఉద్దేశంతో ఈ పథకం అమలు చేశారు. సీసీడీపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ నుంచి నిధుల కేటాయించారు. ఈ పథకం ద్వారా గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడగా, డ్రాపౌట్‌ శాతం భారీగా తగ్గింది. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సకాలంలో ఆశ్రమ పాఠశాలలకు పంపించేందుకు మొగ్గు చూపేవారు. ఈ పథకం ద్వారా సీతంపేట ఐటీడీఏలో 2018-19లో 4,230 మంది విద్యార్థులకు, 2017-18లో 4,828 మంది మందికి ప్రోత్సాహకాల కింద రూ.67 లక్షలు అందించారు. అయితే 2019 తర్వాత సీన్‌ మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆ పథకాన్ని అటకెక్కించింది. నిధులు సమకూర్చడం మానేసింది. దీంతో ఆ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. మొత్తంగా నిధుల లేమితో గిరి ప్రోత్సాహాన్ని నిలుపుదల చేశారు.

పారిశుధ్య సేవలకు బ్రేక్‌..

సీతంపేట ఐటీడీఏ పరిధిలో 18 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పారిశుధ్య పనులకు గాను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 8 మంది గిరిజన యువతను నియమించారు. ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చి మరుగుదొడ్లు నిర్వహణ చేయించేవారు. 2018-19లో సీసీడీపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా పలు పాఠశాలలను దత్తత తీసుకుని పారిశుధ్య మెరుగు చర్యలు చేపట్టారు. అయితే నిధులు లేవనే సాకుతో వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా నిలుపుదల చేసింది. మరుగుదొడ్ల నిర్వహణకు నియమించిన వారిని కూడా తొలగించారు. దీంతో ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల, గురుకులాల్లో పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

కానరాని వేసవి శిక్షణ శిబిరాలు...

వేసవి సెలవుల్లో గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తే స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయనే ఉద్దేశంతో గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను నిర్వహించేంది. ఈ మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసేవారు. ప్రత్యేకంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌, గణితం, డ్రాయింగ్‌, పెయింటింగ్‌పై శిక్షణ తరగతులు నిర్వహించేవారు. అబాకాస్‌ కుట్లు, అల్లికలు, కూచిపూడి, భరతనాట్యం వంటి వాటిల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలికలకు శిక్షణ ఇచ్చేవారు. అప్పట్లో సుమారు 568 మంది విద్యార్థులు ప్రయోజనం పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలకు కూడా మంగళం పాడేసింది. నిధులు సమకూర్చకపోవడంతో గడిచిన ఐదేళ్లుగా వాటిని నిర్వహించడం లేదు. దీంతో వైసీపీ సర్కారు తీరుపై గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గిరిజన సంక్షేమశాఖ డీడీని వివరణ కోరగా.. ప్రస్తుతం వేసవి శిక్షణ వంటి పథకాలేవీ అమలు కావడం లేదని స్పష్టం చేశారు.

Updated Date - Apr 26 , 2024 | 11:19 PM