ఏఎన్‌ఎంల నియామకం ఫైల్‌పై తొలి సంతకం
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:33 PM
రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి సోమవారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎం నియమాకానికి సంబంధించిన ఫైల్‌పై ఆమె తొలి సంతకం సంతకం చేశారు.

- మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి
పార్వతీపురం, జూన్ 17(ఆంధ్రజ్యోతి)/సాలూరు రూరల్: రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి సోమవారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎం నియమాకానికి సంబంధించిన ఫైల్‌పై ఆమె తొలి సంతకం సంతకం చేశారు. ఈ నెల 12న సంధ్యారాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా వెలగపూడి సచివాలయం మూడో బ్లాక్ తొలి అంతస్తులో కేటాయించిన చాంబర్‌లో రాష్ట్రమంత్రి ఆమె అడుగుపెట్టారు. తల్లి పార్వతమ్మ, భర్త జయకుమార్, కుమారుడు పృఽథ్వీ , పార్టీ శ్రేణులు, అధికారులతో వెళ్లి పూజలు చేసిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పక్కనే ఉన్న తల్లి చేతులను పట్టుకొని ఆశీస్సులు తీసుకున్నారు. కాగా తన భర్త జన్ని ముత్యాలు 1972లో సాలూరు ఎమ్మెల్యేగా చేయగా.. ఇప్పుడు తనయురాలు సంధ్యారాణిని రాష్ట్రమంత్రిగా చూడడంతో తల్లి పార్వతమ్మ సైతం భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం ‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాల నివారణకు, వారి ఆరోగ్య పర్యరక్షణకు చర్యలు తీసుకుంటాం. దీనిలో భాగంగానే ప్రతి ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకానికి సంబంధించి తొలి సంతకం చేశా. అదేవిధంగా గిరిజన గర్భిణుల వసతిగృహాల పటిష్ఠతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఫీడర్ అంబులెన్స్‌లను సమర్థవంతంగా నిర్వహిస్తాం. గిరిజనులకు డోలీ బాధలు తప్పిస్తాం. మాతా శిశు మరణాలను ఆరికడతాం. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగు, సాగునీరు, రహదారులు తదితర సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తాం. ఐటీడీఏలను ప్రక్షాళన చేసి.. గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలందిస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తాం. గత వైసీపీ పాలనలో కుళ్లిపోయిన గుడ్లు, పాడైన పాలు ఇచ్చే వారు. ఇకపై అటువంటి పరిస్థితి ఉండదు’ అని ఆమె తెలిపారు. . రెండు శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. త్రికరణ శుద్ధితో పనిచేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అభివృద్ధే తన బాట అని కక్ష సాధింపు ప్రశ్నే ఉండదని స్పష్టం చేశారు.