అంగన్‌వాడీల సమ్మె ఉధృతం
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:19 PM
తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. వినూత్న రీతిలో నిరసనలు చేపడుతు న్నారు.

- వినూత్నంగా నిరసనలు
- జిల్లాలో సంతకాల సేకరణ
విజయనగరం (ఆంధ్రజ్యోతి) జనవరి 12 : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. వినూత్న రీతిలో నిరసనలు చేపడుతు న్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎస్మా ప్రయోగించినా, కేంద్రాల తాళాలు పగులగొట్టినా, రాజ కీయ నాయకులతో భయపెట్టినా తగ్గేదేలే అంటూ పోరును మరింత ఉధృతం చేస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా, వారి పోరాట పటిమకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల శిబిరాల వద్ద శుక్రవారం నుంచి సంతకాల సేకరణ మొదలయ్యింది. కలెక్టరేట్ వద్ద చేపడుతున్న నిరవధిక సమ్మెలో సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరావు మాట్లాడుతూ.. 32 రోజులుగా అంగన్‌వాడీలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బి.పైడిరాజు, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు. మెరకముడిదాం మండల కేంద్రంలో అంగన్‌వాడీలు సంక్రాంతి పిండి వంటలు చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ నాయకులు టీవీ రమణ తదితరులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంతో శుక్రవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని టీవీ రమణ తెలిపారు. బాడంగి మండలంలో అంగన్‌వాడీలు జీవో నెంబరు 2 పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. రామభద్రపురం మండలంలో చీర చెంగులతో వాహనాలను శుభ్రం చేసి నిరసన తెలిపారు.