Share News

ఐదేళ్ల విధ్వంసానికి చరమగీతం

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:39 PM

ఐదేళ్ల నిరంకుశ, అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. వైసీపీ పాలనలో అందరూ ఇబ్బందులు పడ్డారు. ఒక్కో వర్గం ఒక్కో విధంగా బాధితులయ్యారు. జిల్లాలో కొందరిని టార్గెట్‌ చేసి అన్యాయంగా ఇబ్బందులు పెట్టిన ఘటనలూ ఉన్నాయి.

ఐదేళ్ల విధ్వంసానికి చరమగీతం
2022 ఫిబ్రవరి22 న కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన అంగన్వాడీలు

ఐదేళ్ల విధ్వంసానికి చరమగీతం

టీడీపీకి పట్టం కట్టిన జిల్లా ప్రజలు

అవినీతి మచ్చలేని అశోక్‌గజపతిరాజుకూ అవమానాలు

మాజీ మంత్రి కళావెంకటరావు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ ప్రదక్షిణలు

టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరిత కేసులు

భూదందాల్లో మునిగితేలిన వైసీపీ శాసన సభ్యులు

యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్‌ తవ్వకాలు

శృంగవరపుకోట, జూన్‌ 4:

ఐదేళ్ల నిరంకుశ, అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. వైసీపీ పాలనలో అందరూ ఇబ్బందులు పడ్డారు. ఒక్కో వర్గం ఒక్కో విధంగా బాధితులయ్యారు. జిల్లాలో కొందరిని టార్గెట్‌ చేసి అన్యాయంగా ఇబ్బందులు పెట్టిన ఘటనలూ ఉన్నాయి. అటువంటి వారిలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఒకరు. అవినీతి మచ్చలేని నేతగా.. విలువలకు ప్రాణమిచ్చే వ్యక్తిగా అశోక్‌ గుర్తింపు పొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన అనుభవం వుంది. జగన్‌ ప్రభుత్వం ఇతన్నీ వదల్లేదు. మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ పదవి నుంచి అక్రమంగా తప్పించారు. రామతీర్థం అనువంశక ధర్మకర్త పదవి నుంచి తొలగించారు. ఇంకా అనేక రకాలుగా అవమానించారు. హోంమంత్రిగా పనిచేసిన కిమిడి కళావెంకటరావును కూడా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పారు. రామతీర్థం బోడికొండపై వున్న శ్రీరాముడి విగ్రహం ధ్వంసం సమయంలో ఘటనను పరిశీలించేందుకు నారాచంద్రబాబు నాయుడు వస్తుండడంతో కళావెంకటరావు కూడా వెళ్లారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రావడంతో స్వల్ప ఘర్షణ జరిగింది. విజయసాయిరెడ్డిపై రాళ్లు విసిరేలా ప్రోత్సహించారని కళావెంకటరావుపై అభియోగం మోపారు. అరెస్టు చేసేందుకు చూశారు. స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించారు. నాయకుల పరంగా ప్రభుత్వం సృష్టించిన అరాచకాలు ఇవి కాగా ప్రజల ఇబ్బందులు అనేకం.

- ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇలా అన్ని వర్గాల వారు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమించారు. వీరి పోరాటాన్ని బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో మహిళలను కూడా పోలీస్‌స్టేషన్‌లకు ఈడ్చుకెళ్లారు.

- అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ భూములపై పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారు. అసైన్డ్‌ భూములను సొంతం చేసుకున్నారు. కన్నుపడిన భూములను రైతులను బయపెట్టి లాక్కొన్నారు. ఉద్యోగుల బదిలీకి రేటు పెట్టారు.

- రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో భూమి కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక యూనివర్సిటీని వేరే చోటుకు తరలించారు. అక్కడా భవన నిర్మాణం జరగలేదు.

- నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్‌, పెట్రోలు, విద్యుత్‌ చార్జీలవంటి వాటిపై బాదుడే బాదుడు. ఏటేటా పెంచేయడంతో ప్రజలను ఆర్థిక ఇబ్బందిల్లోకి నెట్టేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం ధరలను పెంచి నాణ్యత లేని మద్యాన్ని తీసుకొచ్చారు. ఎందరో పేదలను రోగాల పాలు చేశారు.

- ప్రశ్నించే సామాన్యులను కేసులతో భయపెట్టారు. ప్రతిపక్ష నేతలనే కాదు పార్టీకు విరుద్దంగా మాట్లాడిన సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులనూ వదల్లేదు. శృంగవరపుకోట సర్పంచ్‌ గనివాడ సంతోషికుమారిని బెదిరించారు. ప్రశ్నించడంతో ఈమె భర్త సతీష్‌పై కేసు పెట్టించారు. అడుగడుగునా అవమానపరిచారు. వైసీపీకి చెందిన స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజు భార్య సుధారాణి టీడీపీలో చేరిందన్న కారణంతో రఘురాజును పదవీచ్యుతులను చేశారు. లక్కవరపుకోట మండలం రంగారాయపురం పంచాయితీ పరిధిలో ప్రత్యేక అధికారుల పాలనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పనులు జరిగాయి. ఈ పనులకు సంబంధించిన బిల్లులపై సర్చంచ్‌ కరెండ్ల రామలక్ష్మి సంతకం పెట్టడం లేదన్న అక్కసుతో అనేక విధాలుగా వేధించారు. ఈమె టీడీపీకి చెందిన మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు మరదలు కావడంతో అధికారులు సహకరించడం మానేశారు.

- వేపాడ మండలం పాటూరు గ్రామానికి చెందిన ద్వారపూడి నాగేశ్వరరావు ఉపాధి హామీ పథకం ప్రారంభం నాటి నుంచి క్షేత్ర సహాయకుడిగా పని చేస్తున్నారు. ఇతను తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడిగా ముద్రపడ్డాడు. దీంతో స్థానిక వైసీపీ నేతలు ఇతన్ని ఎలాగైన తొలగించాలని పన్నాగం పన్ని అకారణంగా ఆరోపణలు చేసి ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేసి విధులకు తాత్కాలికంగా దూరం పెట్టారు.

- ఇదే మండలం కొండగంగుబూడికి చెందిన చల్ల వెంకటరావు టీడీపీలో బలమైన నాయకుడు. అసైన్డ్‌ భూములను అక్రమించి రుణం పొందిన ఓ వ్యక్తిని ఇదేం తీరు అని ప్రశ్నించాడు. అంతే అకారణంగా హత్యాప్రయత్నం కేసు మోపి జైలులో పెట్టించారు. ఈ విధంగా ఐదేళ్ల నిర్బాంధాలు, కక్షసాధింపులు, విధ్వంసాలు, అణిచివేతలకు ప్రజలు మంగళవారం చరమగీతం పాడారు.

Updated Date - Jun 05 , 2024 | 11:39 PM