Share News

విధ్వంసానికి చరమగీతం

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:30 AM

వైసీపీ సర్కారు ఐదేళ్ల పాటు సాగించిన విధ్వంసానికి జిల్లావాసులు చరమగీతం పాడారు. అరాచక పాలనకు ముగింపు పలికారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి, అణచివేత, కక్ష సాధింపు చర్యలకు తావులేదని చాటి చెప్పారు. తమ అమూల్యమైన ఓటుతో ఆ పార్టీ నేతలకు గట్టిగా బుద్ధి చెప్పారు.

విధ్వంసానికి చరమగీతం

‘మన్యం’లో అభివృద్ధి శూన్యం

ఐదేళ్లూ ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరిత చర్యలు

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలపైనా కేసులు

భూ కబ్జాలు, ఇసుక, మట్టి దందాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు

నాలుగు నియోజకవర్గాల్లో కూటమికి పట్టం కట్టిన ఓటర్లు

సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలంటున్న ప్రజలు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

వైసీపీ సర్కారు ఐదేళ్ల పాటు సాగించిన విధ్వంసానికి జిల్లావాసులు చరమగీతం పాడారు. అరాచక పాలనకు ముగింపు పలికారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి, అణచివేత, కక్ష సాధింపు చర్యలకు తావులేదని చాటి చెప్పారు. తమ అమూల్యమైన ఓటుతో ఆ పార్టీ నేతలకు గట్టిగా బుద్ధి చెప్పారు. గతంలో అధికార పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే ఇప్పుడు వైసీపీని అథఃపాతాళానికి తొక్కేశారు. జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు తిరుగులేని విజయాన్ని అందించారు. సాలూరు, పార్వతీపురం, కురుపాంలో టీడీపీ, పాలకొండ జనసేన పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీని అందించారు. తమకు అభివృద్ధి, సంక్షేమం రెండూ ముఖ్యమని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనలో జిల్లా తిరిగి ప్రగతి పథంలో నడుస్తుందనే నమ్మకంతో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. కాగా గత ఐదేళ్లలో వైసీపీ సర్కారు పాలనలో ‘మన్యం’లో పరిస్థితులను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్క చాన్స్‌ అని వైసీపీ మోసం

వైసీపీ పాలనలో అందరూ ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా బాధితులయ్యారు. జిల్లాలో కొందరిని టార్గెట్‌ చేసి అన్యాయంగా ఇబ్బందులు పెట్టిన ఘటనలూ ఉన్నాయి. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బిడ్డగా తనకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్‌ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ప్రజలను అన్నింటా మోసం చేసి ఐదేళ్ల పాటు పాలన చేట్టారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు మినహా.. జిల్లాలో వైసీపీ సర్కారు చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ చేపట్టలేదు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైసీపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. కేవలం బటన్‌ నొక్కడం తప్ప మరేమీ చేయలేదు. దీంతో జిల్లా అన్నింటా వెనకబడింది.

నిధుల్లేవ్‌.. పనుల్లేవ్‌..

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసింది. వాటి ఆధునికీకరణ మాటెలా ఉన్నా.. కనీసం నిర్వహణకు కూడా నిధులు మంజూరు చేయలేదు. రైతుల గోడును కూడా సర్కారు పట్టించుకోలేదు. సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పంటలు విక్రయం, గిట్టుబాటు ధర .. ఇలా అనేక విషయాల్లో ఏటా అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రభుత్వం స్పందించలేదు. మరోవైపు ‘మన్యం’లో అనేకచోట్ల నెలకొన్న తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేదు. ఏజెన్సీ ప్రాంతాలపైనా దృష్టి సారించలేదు. విద్య, వైద్య సదుపాయాలపైనా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో నేటికీ గిరిజన గ్రామస్థులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అనేక కొండ శిఖర గ్రామాలకు రహదారి సౌకర్యం కూడా కల్పించలేదు. ప్రధానంగా జిల్లాలో ప్రధాన రహదారులకు మరమ్మతులు కూడా చేపట్టలేకపోయారు. భారీ గోతులతో అధ్వానంగా మారిన రోడ్లపై తరచూ ప్రమాదాలు జరిగినా.. పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదిలా ఉండగా జిల్లాలో నిరుద్యోగ యువత, గిరిజన విద్యార్థులకు ఉపాఽఽఽధి లేకుండా చేశారు. స్థానికంగా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా వాసులు ఇతర రాష్ర్టాలకు వలస బాట పట్టాల్సిన దుస్థితి కల్పించారు. జిల్లాలో సీతానగరం, కొమరాడ మండలాల్లో ప్రధాన వంతెన నిర్మాణాలను కూడా పూర్తి చేయలేకపోయారు. వైసీపీ పాలనలో విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలను ఇస్టానుసారంగా పెంచి ప్రజలపై పెను భారం మోపారు. నిత్యావసరాల ధరలు అదుపులోకి తేలేకపోయారు. ఇక వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌పై బాదుడే బాదుడు.. కనీసం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కొంతైనా రాయితీ ఇవ్వలేదు. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామ పరిధిలో భూమి కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక యూనివర్సిటీని వేరే చోటుకు తరలించారు. అక్కడా భవన నిర్మాణం జరగలేదు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం ధరలను పెంచి నాణ్యత లేని మద్యాన్ని తీసుకొచ్చారు. ఎందరో పేదలను రోగాల పాలు చేశారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వ కాలంలో జిల్లా అభివృద్ధి జీరో అని చెప్పవచ్చు. దీంతో ప్రజలు విసుగెత్తి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి.. కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలికారు అని చెప్పొచ్చు.

ప్రశ్నిస్తే జైలుకే..

ప్రశ్నించే సామాన్యులను కేసులతో భయపెట్టారు. ప్రతిపక్ష నేతలనే కాదు పార్టీకి విరుద్ధంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, తమ సమస్యలు పరిష్కరించాలని పలు దఫాలు రోడ్డెక్కిన ప్రజా సంఘాల నేతలను సైతం వైసీపీ సర్కారు వదలలేదు. అక్రమ కేసులు బనాయించి.. వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంది. అయితే వైపీపీ ప్రభుత్వంలో మాత్రం ఎవరికీ ఆ హక్కు లేకుండా చేసిందని చెప్పవచ్చు. ప్రశ్నిస్తే.. కేసులు.. దాడులు.. జైలుకు పంపించడమే లక్ష్యంగా ఐదేళ్ల పాటు పాలన కొనసాగించింది.

ఉద్యోగుల మనసుకు గాయం

వైసీపీ సర్కారు పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. వారి సమస్యలను పరిష్కరించకపోగా ఇతర అవసరాల కోసం ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఆ సొమ్మును ఇవ్వాలని అడిగిన ఉద్యోగులపై అక్రమంగా కేసులు నమోదు చేసింది. ప్రతినెలా ఒకటో తేదీకి పింఛన్‌, జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన వారిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగారు. మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను చిన్నచూపు చూస్తూ.. వారి మనసును తీవ్రంగా గాయపరిచింది.

ముందస్తు అరెస్టులు..

తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఉంది. అయితే వైసీపీ పాలనలో ఆ హక్కు కూడా లేకుండా పోయింది. ఎవరైనా ఆందోళనలకు పిలుపునిస్తే చాలు.. సర్కారు ఆదేశాలతో ముందుగా ఆ సంఘ ప్రతినిధులను ఇంటి వద్దే పోలీసులు నిర్బంధించే వారు. అర్ధరాత్రి ప్రజా సంఘాల నేతలకు ఇళ్లకు చేరుకుని హౌస్‌ అరెస్ట్‌ చేసేవారు. ఇంకొంతమందిని పోలీస్‌ స్టేషన్లకు తరలించే వారు. రైలు, బస్సులను నుంచి ఆందోళనకారులను దించేసి అదుపులోకి తీసుకునేవారు. మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను, సంఘ నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. వారి మనసును తీవ్రంగా గాయపరిచారు. గతంలో వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం.. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీస్‌ అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన బాట పట్టగా.. దానిని అమలు చేయకపోగా వారిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇలా అన్ని వర్గాల వారు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమించారు. వీరి పోరాటాన్ని బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో మహిళలను కూడా పోలీస్‌స్టేషన్‌లకు ఈడ్చుకెళ్లారు.

ఎక్కడ చూసినా కబ్జాలే..

జిల్లాలోని కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు గత ఐదేళ్ల కాలంలో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూ.. కోట్లాది రుపాయలను సంపాదించారు.. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించే వారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టేవారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే .. దాడులు, కేసులతో బెదిరించే వారు. తెరవెనుక ఉండి ఇసుక, మట్టి దందాలను నడిపిస్తూ.. రెండు చేతులా సంపాదించారు. మరికొంతమంది గ్రానైట్‌ వ్యాపారుల దగ్గర ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వం ద్వారా అనుమతులు అందించి గ్రానైట్‌ తవ్వకాలకు పూర్తి సహకారాన్ని అందించారు. దీనిని స్థానికులు ఎంతగా వ్యతిరేకించినా వారు పట్టించుకోలేదు. ఎవరైనా గ్రానైట్‌ తవ్వకాలను అడ్డుకుంటే.. వైసీపీ నాయకుల ద్వారా వారిపై కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురి చేసేవారు.

వారంతా వైసీపీ నాయకులే..

టెండర్లు పిలిచి పారదర్శకంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పిన వైసీపీ .. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. రివర్స్‌ టెండరింగ్‌తో అభివృద్ధి పనుల బాధ్యతలను కొంతమంది వైసీపీ నాయకులకు అప్పగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. మరోవైపు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా ముందుగా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంజనీరింగ్‌ అఽధికారులు సైతం కొన్ని శాఖల్లో కాంట్రాక్టర్లకు ఇదే విషయాన్ని సూచించేవారు. చాలాచోట్ల వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా అవతారాలు ఎత్తి కోట్లాది రుపాయలను సంపాదించారని చెప్పవచ్చు. ఎవరైనా అఽధికారి నాణ్యత గురించి ప్రశ్నిస్తే.. కక్ష సాధింపు చర్యలు తీసుకునేవారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వ వైఖరి , ఆ పార్టీ నేతల తీరుతో ఉన్నతాధికారులు సైతం ఏమీ అనలేని పరిస్థితి.

అధికారులందరూ హాజరు వేసుకోవాల్సిందే..

జిల్లాలో ఒక్క నియోజకవర్గం మినహా మిగిలిన మూడు చోట్ల కూడా ఏ అధికారి ఏ పని చేయాలన్నా.. ముందుగా స్థానిక ఎమ్మెల్యే దగ్గర అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వైసీపీ ఐదేళ్ల పాలనలో కొనసాగిందని చెప్పవచ్చు. వివిధ నియోజకవర్గాల్లో మండల స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎమ్మెల్యే చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఒక్కముక్కలో చెప్పాలంటే రోజూ అక్కడకు వెళ్లి హాజరు వేసుకోవాల్సిన దుస్థితి. ఎవరైనా అలా నడుచుకోకపోయినా.. ఎమ్మెల్యే ఆగ్రహానికి గురైనా.. ఇక అంతే సంగతి. వెంటనే వారిని బదిలీ చేసేవారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లు పనులు చేసిన అధికారులకు మాత్రం స్థానచలనం ఉండేది కాదు. ఏళ్ల తరబడి అదే పోస్టులో కొనసాగించేవారు. జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే రెవెన్యూ శాఖనే తన ఆధీనంలోకి తెచ్చుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గత ఐదేళ్ల కాలంలో ఆ ఎమ్మెల్యే ఆదేశాలే రెవెన్యూ శాఖ పాటించిందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యేలను భాగస్వాములుగా చేసుకుంటే గానీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి. ఇలా చెప్పుకుంటే పోతే గత ఐదేళ్లలో వైసీపీ నేతల తీరుతో జిల్లావాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 12:30 AM