Share News

ఎకరం రూ.లక్ష!

ABN , Publish Date - May 23 , 2024 | 11:07 PM

వీలుపర్తి రెవెన్యూలోని గెడ్డ, వాగు, డి.పట్టా భూములు కారుచౌకగా అమ్మకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే రైతుల నుంచి లీజు పేరుతో చేజెక్కించుకున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు విక్రయించేందుకు చూస్తున్నారు. ఈ విషయం తెలిసి రైతులు అడ్డుకుంటున్నారు. వీరికి అండగా నిలిచిన ఉపసర్పంచ్‌ భర్తకు బెదిరింపులు వస్తున్నాయి.

ఎకరం రూ.లక్ష!
ప్రభుత్వ భూములను చూపుతున్న రైతులు

ఎకరం రూ.లక్ష!

డి.పట్టా, గెడ్డ పోరంబోకు భూముల అమ్మకం

ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు అడ్డుగోలుగా..

వీలుపర్తి రెవెన్యూలో గుట్టుగా వ్యవహారం

అడ్డుకున్న ఉపసర్పంచ్‌ భర్తకు బెదిరింపులు

వేపాడ, మే 23: వీలుపర్తి రెవెన్యూలోని గెడ్డ, వాగు, డి.పట్టా భూములు కారుచౌకగా అమ్మకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే రైతుల నుంచి లీజు పేరుతో చేజెక్కించుకున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు విక్రయించేందుకు చూస్తున్నారు. ఈ విషయం తెలిసి రైతులు అడ్డుకుంటున్నారు. వీరికి అండగా నిలిచిన ఉపసర్పంచ్‌ భర్తకు బెదిరింపులు వస్తున్నాయి.

వీలుపర్తి గ్రామ రెవెన్యూలో సర్వే నెంబరు 4, 6లలో గల 26 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమి, సర్వే నెంబరు 2, 4, 6లలో గల డి.పట్టా భూములు 33 ఎకరాలతో పాటు వేపాడ రెవెన్యూలో మరో 30 ఎకరాల వరకు డి.పట్టా భూములను గతంలో కొందరు వ్యక్తులు రైతుల నుంచి అనధికారికంగా లీజు ఒప్పందంతో తీసుకున్నారు. అనంతరం ఆ భూముల్లో చేపల చెరువులు, వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వారు ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఈ భూములను గెడ్డ పోరంబోకు ఎకరా రూ.లక్ష చొప్పున, డి.పట్టా భూములు ఎకరా రూ..రెండు లక్షలకు విక్రయించేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన రైతులు, ఉప సర్పంచ్‌ భర్త గోకాడ అచ్చెంనాయుడు ఆధ్వర్యంలో భూముల విక్రయాన్ని అడ్డుకుంటున్నారు. ఈ విక్రయాలు జరిగితే తర్వాత భూములు రైతులకు పూర్తిగా దక్కవన్నది వారి భయం. దీనిపై ఉపసర్పంచ్‌ భర్త గోకాడ అచ్చెంనాయుడు ఆధ్వర్యంలో రైతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు రైతులకు అండగా ఉండకపోగా తిరిగి భూముల కొనుగోలుదారుకు మద్దతుగా మాట్లాడుతూ ఉప సర్పచ్‌ను బెదిరిస్తున్నారు. పోలీసులు తనను కార్యాలయానికి పిలిచి బెదిరించారని అచ్చెంనాయుడు విలేకరుల వద్ద బుధవారం వాపోయారు. తనపై రౌడీ షీట్‌ ఓపెన్‌ చేస్తానని, తప్పడు కేసులు బనాయించి రాజకీయ జీవితం లేకుండా చేస్తానంటూ ఓ పోలీస్‌ అధికారి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

- ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని గ్రామస్థులు గోకాడ చిన్న అప్పలనాయుడు, పి.ప్రసాదు, గోకాడ కన్నంనాయుడు, సత్యారావు, శ్రీను, ఉల్లి సన్నిబాబు, సీతమ్మ, గోకాడ నర్సిబాబు, అప్పలనాయుడు, కంబాలముత్యాలయ్య, లక్కవరపు అచ్చన్న, శంకర్‌, ఏడువాకరాములు, నర్సిబాబు, అప్పారావు తదితరులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల అమ్మకాలపై దృష్టి సారించి నిరుపేద రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

విచారించి చర్యలు

వీలుపర్తి రెవెన్యూలో గెడ్డ , వాగు, డి.పట్టా భూముల అమ్మకాలపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడ్తాం. జిల్లా అధికారులకు నివేదిక అందించడంతో పాటు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం.

- కె.సత్య, తహసీల్దార్‌, వేపాడ

Updated Date - May 23 , 2024 | 11:07 PM