Share News

ఇక మిగిలింది చీపురుపల్లే

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:57 PM

ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు గాను మొదటి జాబితాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇక మిగిలింది చీపురుపల్లే

- ఈ స్థానానికి అభ్యర్థి ఎవరో?

- జిల్లాలో ఆరింటికి అభ్యర్థుల ప్రకటన

- విజయనగరం ఎంపీ టికెట్‌కు పోటీ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు గాను మొదటి జాబితాలో విజయనగరం, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా శుక్రవారం టీడీపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఎస్‌.కోట నియోజకవర్గానికి కోళ్ల లలితకుమారి పేరును ప్రకటించారు. ఇక మిగిలింది చీపురుపల్లి నియోజకవర్గమే. ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించుతారో తేలాల్సి ఉంది. ఎచ్చెర్ల నియోజవర్గం టిక్కెట్‌ను బీజేపీకి కేటాయిస్తే ఇక్కడి టిక్కెట్‌ను ఆశిస్తున్న సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు పోటీగా దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇంతవరకు మాజీ మంత్రి, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీలోకి దిగుతారని అంతా భావించారు. అయితే గంటా భీమిలి నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సకు ధీటైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఒకవేళ ఎచ్చెర్ల సీటు బీజేపీకి కేటాయిస్తే కళావెంకట్రావుకు సీటు లేకుండా పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కళాను చీపురుపల్లి నుంచి పోటీకి దింపేందుకు అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏవిధంగా రాజకీయ సమీకరణలు మారుతాయో చూడాలి.

ఎంపీ సీటు ఎవరికో?

విజయనగరం పార్లమెంట్‌ స్థానం విషయంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక నిర్ణయానికి రాలేక పోతుంది. ముందు ఈ సీటును బీజేపీకి కేటాయించినట్లు ప్రచారం జరిగింది. అయితే విజయనగరం బదులు విశాఖ ఎంపీ సీటు కోసం బీజేపీ నాయకులు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ టిక్కెట్‌ను శ్రీభరత్‌కు టీడీపీ ప్రకటించింది. దీంతో విజయనగరం బదులు వేరే నియోజవర్గం కోసం బీజేపీ అన్వేషణలో పడింది. అయితే భరత్‌కు టీడీపీ టిక్కెట్‌ ప్రకటించడం మంచి పరిణామమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖ ఎంపీ స్థానం బీజేపీకి ఇస్తే గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంచనాలు కూడా వేశారు. దీనికి కారణం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం. దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందన్నది ఒక వాదన. అందుకే భరత్‌కు సీటును కేటాయించారు. విజయనగరం ఎంపీ టిక్కెట్‌ కోసం అశోక్‌ గజపతిరాజు, కర్రోతు బంగారురాజు, ఆనంద్‌కుమార్‌, చంద్రశేఖర్‌ ఇలా అనేకమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి.

Updated Date - Mar 22 , 2024 | 11:57 PM