పోలింగ్‌కు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 12 , 2024 | 11:38 PM
సార్వత్రిక పోరు తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి సామగ్రి తరలింపు పూర్తయింది

ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
నేటి ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్
పోలీసు, కేంద్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు
పార్వతీపురం, మే12 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక పోరు తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి సామగ్రి తరలింపు పూర్తయింది. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఆదివారం ఉదయమే జిల్లాలోని డిస్ర్టిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుని ఎన్నికల సామగ్రిని తీసుకున్నారు. పోలింగ్ సమయాల్లో చేపట్టాల్సి విధివిధానాల గురించి వారికి అధికారులు వివరించారు. సెక్టార్ల వారీగా పోలింగ్ కేంద్రాల విధులు అప్పగించారు. దీంతో ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు, ఇతర సామగ్రితో వారికి కేటాయించిన కేంద్రాలకు పయనమయ్యారు.
సెక్టార్ల వారీగా..
పార్వతీపురంలో 33 సెక్టార్లు, పాలకొండలో 35 , కురుపాంలో 44, సాలూరులో 32 సెక్టార్లు ఏర్పాటు చేశారు. పార్వతీపురం, పాలకొండ, కురుపాంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, సాలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఆయా కేంద్రాల నుంచి ఈవీఎంల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు స్ర్టాంగ్ రూమ్‌లను తెరిచి ఈవీఎంల పంపిణీ ప్రారంభించారు. ఎన్నికల సిబ్బందికి సెక్టార్ ,రూట్ వారీగా బస్సులు ఏర్పాటు చేసి బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు పంపించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియను కలెక్టర్ నిశాంత్‌కమార్ పర్యవేక్షించారు. జేసీ శోభిక, సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం ఆర్వోలు విష్ణుచరణ్, శుభం బన్సల్, కె.హేమలత, వీవీ రమణ తమ నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మాక్ పోలింగ్‌తో ప్రారంభం
పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం ఏజెంట్ల సమక్షంలో నమూనా ఓటింగ్ (మాక్ పోలింగ్) నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. పార్వతీపురంలో సాయంత్రం ఆరు గంటల వరకు, సాలూరు, కురుపాం, పాలకొండలో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఎన్నికల సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సైతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సిబ్బందికి ఆహారం, వసతి సౌకర్యాలతో సహా అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో తొలిసారిగా..
పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తంగా 1,031 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 219గా గుర్తించారు. ఏపీ-ఒడిశా వివాదస్పద గ్రామాలైన కొఠియా గ్రూప్‌లో ప్రత్యేకంగా మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్వతీపురంలో 443, సాలూరులో 148, పాలకొండలో 142, కురుపాంలో 132 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ జరగనుంది. జిల్లాలో మూడు మూడు ఆర్టీసీ డిపోల నుంచి 280 బస్సులను ఎన్నికల నిర్వహణకు కేటాయించారు.
ఓటర్లు ఇలా..
‘మన్యం’లో 7,83,440 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 3,82,589 మంది, మహిళలు 4,00,779 మంది, థర్డ్‌జెండర్లు 72 మంది ఉన్నారు. కురుపాం నియోజకవర్గంలో 1,94,114 మంది, పార్వతీపురంలో 1,89,817 మంది, సాలూరులో 2,04,489మంది ఓటర్లు ఉన్నారు. అయితే సాలూరు నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలు పార్వతీపురం మన్యంలో, మెంటాడ మండలం విజయనగరం జిల్లాలో ఉంది. దీంతో భద్రత ఏర్పాట్లను ఇరు జిల్లాల పోలీసుల అధికారులు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ‘మన్యం’లో మొత్తంగా 6,600 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. 1,150 మంది పోలీసులు, ఆరు కంపెనీల కేంద్ర బలగాలు కూడా ఎన్నికల నిర్వహణలో భాగస్వాములయ్యారు.