ప్రమాద ఘంటికలు
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:32 PM
తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. 2.534 టీఎంసీల నుంచి 1.370 టీఎంసీలకు స్టోరేజ్ పడిపోయింది.
- ‘తోటపల్లి’లో తగ్గిన స్టోరేజ్
- ప్రస్తుతం 1.370 టీఎంసీలే నిల్వ
- వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం
- అప్రమత్తమైన అధికారులు
- కాలువలకు నీటి సరఫరా నిలిపివేత
- ఇప్పటికే పంటలు సాగుచేసిన రైతుల్లో ఆందోళన
గరుగుబిల్లి, మార్చి 3: తోటపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. 2.534 టీఎంసీల నుంచి 1.370 టీఎంసీలకు స్టోరేజ్ పడిపోయింది. దీంతో వేసవిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడింది. ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై కాలువలకు నీటి సరఫరాను నిలుపుదల చేశారు. అయితే, పాలకుల మాటలు నమ్మి రబీ సాగుకు ఉప్రకమించిన రైతులు ఇప్పుడు తోటపల్లి నీరు నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు నుంచి రెండు ప్రధాన కాలువలకు నీటి సరఫరాను అధికారులు నిలుపుదల చేశారు. గత కొన్నాళ్లుగా తోటపల్లిలో నీటి నిల్వలు పుష్కలంగా ఉండేవి. కుడి, ఎడమ ప్రధాన కాలువల నుంచి ఖరీఫ్, రబీకి అందించినా నీటి నిల్వలు సమృద్ధిగా ఉండేవి. అయితే ఈ ఏడాది అనుకున్న మేర వర్షాలు కురవకపోవడంతో పైనుంచి ప్రాజెక్టులోకి నీరు చేరని దుస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను ప్రస్తుతం 102.98 మీటర్లకు నీరు చేరుకుంది. ప్రాజెక్టుకు సంబంధించి నిల్వ సామర్థ్యం 2.534 టీఎంసీలకు గాను 1.370 టీఎంసీలకు చేరడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రాజెక్టులో అనూహ్యంగా నీటి నిల్వలు తగ్గు ముఖం పట్టడంతో గేట్లను దించి కాలువలకు సరఫరాను నిలుపుదల చేశారు. ఇప్పుడు మేల్కొనకపోతే వేసవిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు తీవ్ర తాగునీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి కాలువలకు నీటిని ఆపేశారు.
రైతుల్లో ఆందోళన
నెల రోజుల క్రితం ఉల్లిభద్రలోని కుడి ప్రధాన కాలువ నుంచి 600 క్యూసెక్కుల నీటిని చెరువులు, తాగునీటి అవసరాలకు విడుదల చేశారు. ఆ సమయంలో ఎడమ ప్రధాన కాలువ, పాత రెగ్యులేటర్ పరిధిలోని కుడి కాలువ నుంచి నీరు సరఫరా చేయలేదు. అయితే తాగునీటి అవసరాలకు విడుదల చేసిన నీటిని పలు ప్రాంతాలకు చెందిన రైతులు రబీలో పంటల సాగుకు ఉపయోగించారు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడమని, సాగు నీటికి ఇబ్బంది లేదని అధికార పార్టీకి చెందిన ప్రతినిధులు చెప్పడంతో రైతులు రబీలో సాగుకు ఉప్రకమించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులు హామీ ఇచ్చినా ఇప్పుడు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లు దించారు. కుడి, ఎడమ కాలువల పరిధిలో రైతులు వందల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ప్రస్తుతం నీటి సరఫరా నిలుపుదల చేయడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి వేలాది రూపాయలు మదుపులు పెట్టామని, ఇప్పుడు నీటి నిలుపుదలతో పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల మాటలు నమ్మి మోసపోయామని మండిపడుతున్నారు.
ఇబ్బందులు లేకుండా చర్యలు
తోటపల్లి ప్రాజెక్టు నుంచి పార్వతీపురం పట్టణంతో పాటు నారాయణపురం, తదితర ప్రాంతాలకు తాగునీటికి కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం అధికంగా ఎండలు కాస్తుండడంతో తాగునీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంది. ప్రజల అవసరాలను గుర్తించి సాగుకు కాకుండా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గు ముఖం పట్టాయి. కాలువల నుంచి లీకుల రూపంలో కొంతమేర, తాగునీటి అవసరాలకు కొంతమేర సరఫరా చేయ డంతో నీటి నిల్వలు తగ్గాయి. ఇప్పుడు సాగు నీటిని విడుదల చేస్తే ప్రాజెక్టు అడుగంటే ప్రమాదం ఉంది. వేసవిలో తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆరుతడి పంటలకు సాగునీరు సరఫరా చేసే అవకాశం లేదు. దాహార్తిని తీర్చేందుకే విడుదల చేస్తున్నాం. రైతులు గ్రహించాలి.
-కిశోర్‌కుమార్, తోటపల్లి ప్రాజెక్టు జేఈ, పార్వతీపురం