Share News

అన్న క్యాంటీన్లపై అక్కసు

ABN , Publish Date - May 08 , 2024 | 10:55 PM

అన్న క్యాంటీన్లలో రూ.15కే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం లభించడంతో వారికి ఖర్చులు బాగా కలిసివచ్చేవి. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే సీన్‌ మారింది. పేదలకు అన్న క్యాంటీన్‌ భోజనం దూరం చేశారు. పట్టణాల్లో వాటిని వార్డు సచివాలయాలుగా మార్పుచేశారు. కొన్నిచోట్ల అన్నక్యాంటీన్ల కోసం నిర్మించిన అవుట్‌ లెట్‌లను వేరే అవసరాలకు వినియోగించారు.

అన్న క్యాంటీన్లపై అక్కసు
పార్వతీపురంలోని అన్న క్యాంటీన్‌ భవనంలో ప్రజారోగ్య శాఖ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం నిర్వహిస్తున్న దృశ్యం

నాణ్యమైన భోజనానికి దూరమైన పేదలు

వాటి స్థానంలో మొక్కుబడిగా ఆహా క్యాంటీన్లు

నిర్వహణకు నిధులు కేటాయించని సర్కారు

పెదవి విరుస్తున్న జిల్లావాసులు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

ప్రజలకు పట్టెడన్నం పెట్టడం ప్రభుత్వాల బాధ్యత. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. అప్పట్లో రూ.5లకే భోజనం పెట్టింది. భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులు, యాచకులు.. మధ్యాహ్న వేళల్లో అక్కడే భోజనం చేసేవారు. అన్న క్యాంటీన్లలో రూ.15కే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం లభించడంతో వారికి ఖర్చులు బాగా కలిసివచ్చేవి. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే సీన్‌ మారింది. పేదలకు అన్న క్యాంటీన్‌ భోజనం దూరం చేశారు. పట్టణాల్లో వాటిని వార్డు సచివాలయాలుగా మార్పుచేశారు. కొన్నిచోట్ల అన్నక్యాంటీన్ల కోసం నిర్మించిన అవుట్‌ లెట్‌లను వేరే అవసరాలకు వినియోగించారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వైసీపీ సర్కారు.. త్వరలోనే క్యాంటీన్లు తెరుస్తామని చెబుతూ వచ్చింది. చివరకు అయిష్టంగానే ‘ఆహా క్యాంటీన్లు’ తెరిచింది. అయితే వాటి నిర్వహణకు .. బడ్జెట్‌ కేటాయించలేదు. చివరకు ఆహా క్యాంటీన్లు పేరుకే అన్నట్లుగా మారాయి.

ఇదీ పరిస్థితి..

పేదల కోసం గత టీడీపీ ప్రభుత్వం 2018లో అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు, యాచకులు....ఇలా పట్టణ పేదలు నామమాత్రపు ఖర్చుతో మూడుపూటలా కడుపు నింపుకొనేలా అన్న క్యాంటీన్లకు రూపకల్పన చేసింది. ‘అక్షయపాత్ర’ అనే స్వచ్ఛందసంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రూ.15లకే మూడు పూటలా వేడి వేడి భోజనం అందించేవారు. కాగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో అన్న క్యాంటీన్‌ ప్రారంభించి.. ఎంతో మంది పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టి ఆకలి తీర్చారు. అప్పట్లో రోజుకు 300 మంది అన్న క్యాంటీన్‌లో కడుపునిండా భోజనం చేసేవారు. పార్వతీపురం పట్టణంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు అక్కడకు చేరుకుని భోజనం చేసి తమ ఆకలి తీర్చుకునేవారు. రోజుకో రకమైన టిఫిన్‌ , భోజనంలో అన్నం, సాంబాబు, కూర పచ్చడి, పెరుగు ఉండేది. అయితే ఐదు రూపాయలకే నాణ్యమైన టిఫిన్‌, భోజనం లభిస్తుండడంతో పేదలు ఎంతో ఆనందించేవారు. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు కూడా అన్న క్యాంటీన్‌కు చేరుకుని భోజనం చేసేవారు. పాలకొండ, సాలూరులోనూ అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో ఎన్నికలు రావడంతో ఆయా చోట్ల ప్రారంభం కాలేదు. అయితే వైసీపీ అధికారంలోకి రావడం పేదలకు శాపంగా మారింది. వైసీపీ సర్కారు పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్‌ మూసివేయించింది. దీంతో పేదలు నాణ్యమైన భోజనానికి దూరమయ్యారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న అన్నక్యాంటీన్‌ భవనాన్ని ప్రజారోగ్య శాఖ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంగా మార్చారు.

మొక్కుబడిగానే..

అన్న క్యాంటీన్‌ను మూసివేతతో ప్రజల నుంచి వైసీపీ సర్కారు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. దీంతో ఎన్నికలకు ముందు ప్రభుత్వం జిల్లాకేంద్రం పార్వతీపురంలో ఆహా క్యాంటీన్‌ను ప్రారంభించింది. అయితే దీనికి ప్రజల నుంచి ఆదరణ కరువైంది. ధరలు అధికంగా ఉండడం.. భోజనం నాణ్యతగా లేకపోవడంతో ఇక్కడకు వెళ్లేందుకు పట్టణ పేదలు ఆసక్తి చూపడం లేదు. దీంతో అది వెలవెలబోతోంది. ప్రస్తుతం దానిని మొక్కుబడిగా మాత్రమే నిర్వహిస్తున్నారు.

వైసీపీ తీరుపై ఆగ్రహం

పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కక్ష సాధింపు రాజకీయాలకు తెరతీసిన జగన్‌.. పేదల కడుపు నింపే కార్యక్రమాలను ప్రోత్సహించక పోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారనే కారణంగా వాటిని మూసివేయించి తమ లాంటి పేదలను నాణ్యమైన భోజనానికి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

నేను ఒక ప్రైవేట్‌ దుకాణంలో పనిచేస్తున్నాను. అన్న క్యాంటీన్‌ ఉండేటప్పుడు అక్కడే మధ్యాహ్నం భోజనం చేసేవాడిని. ఐదు రూపాయలకే రుచికకరమైన, నాణ్యమైన భోజనం దొరికేది. వైసీపీ వచ్చిన తర్వాత వాటిని మూసివేయడం వల్ల నాలాంటి ఎంతోమంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- కె.రవీంద్ర, కార్మికుడు, పార్వతీపురం..

=======================

ఆకలి తీరేది...

నేను ప్రైవేట్‌ వాహనం నడుపుకొని జీవనం సాగిస్తున్నాను. అన్న క్యాంటీన్‌ ఉన్న సమయంలో అక్కడే రోజూ మధ్నాహ్న భోజనం చేసేవాడిని. రూ.5లకే ఆకలి తీరేది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కోసం రోజుకు రూ. 80 రూపాయలకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

- అప్పారావు, ప్రైవేట్‌ వాహన డ్రైవర్‌, పార్వతీపురం

=========================

క్యారేజీ అవసరం ఉండేది కాదు....

నేను ఒక హోల్‌సేల్‌ దుకాణంలో పనిచేస్తున్నాను. అన్న క్యాంటీన్‌ ఉన్నప్పుడు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం తినేవాడిని. ఇంటిదగ్గర నుంచి క్యారేజ్‌ తెచ్చుకునే వాడిని కాదు. అన్న క్యాంటీన్‌ మాలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది.

- అప్పలనాయుడు, కార్మికుడు, పార్వతీపురం

Updated Date - May 08 , 2024 | 10:55 PM