Share News

అదరం.. బెదరం

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:55 PM

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సమగ్ర శిక్ష కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది సిబ్బంది మంగళవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు.

అదరం.. బెదరం
బొత్స ఇంటి ముందు బైఠాయించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు

అదరం.. బెదరం

ప్రభుత్వంపై ఒకటే తెగువతో ఆందోళనలు

బొత్స ఇంటిని ముట్టడించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు

చలిలో వణుకుతూ శిబిరంలోనే అంగన్వాడీలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్‌, జనవరి 9: ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సమగ్ర శిక్ష కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది సిబ్బంది మంగళవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కలెక్టరేట్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. పైడితల్లి అమ్మవారి గుడి సమీపంలో ఉన్న మంత్రి ఇంటికి చేరుకున్నారు. గేట్లు నెట్టి ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని వారించారు. దీంతో గంటకు పైగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. తరువాత ముఖ్య నాయకులను పోలీసులు లోపలకు పంపించారు. మంత్రి లేకపోవడంతో ఆయన కుమారుడు సందీప్‌కు వినతిపత్రం అందించారు. కాగా సమ్మెలో ఉన్న సమగ్రశిక్ష ఉద్యోగులు ప్రభుత్వ తీరుకు విసిగి తాడోపేడో తేల్చుకోదలిచారు. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగడంతో మంగళవారం మంత్రి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా కనీసం పట్టించుకోక పోవడం చాలా దారుణమన్నారు.

చలిలో అంగన్వాడీల నిరసన

అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను కొనసాగిస్తున్నారు. మంగళవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు పైడిరాజు మాట్లాడు తూ సమ్మె చేపట్టి 29 రోజులైనా ప్రభుత్వం పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కించడం అన్యాయమన్నారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే వరకూ సమ్మె కొనసాగుతుందన్నారు. ఇదిలా ఉండగా చలి తీవ్రంగా వణికిస్తున్నా మంగళవారం రాత్రి శిబిరంలోనే కూర్చొన్నారు. దుప్పట్లు, తువ్వాళ్లు కప్పుకుని కనిపించారు. కొందరు చలిమంట వేసుకుని సేదతీరారు.

Updated Date - Jan 09 , 2024 | 11:56 PM