Share News

అదరం.. బెదరం

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:18 AM

వైసీపీ ప్రభుత్వ నోటీసులకు భయపడేది లేదని, తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. గురువారం జిల్లావ్యాప్తంగా వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అదరం.. బెదరం
సాలూరులో ఒంటికాలిపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీలు

నినదించిన అంగన్‌వాడీలు

జిల్లావ్యాప్తంగా నిరసనలు

బెలగాం/పాలకొండ/సాలూరు రూరల్‌, సీతానగరం/కురుపాం/కొమరాడ, జనవరి 4: వైసీపీ ప్రభుత్వ నోటీసులకు భయపడేది లేదని, తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. గురువారం జిల్లావ్యాప్తంగా వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 24 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్నా సీఎం జగన్‌ స్పందించక పోవడం దారుణమన్నారు. ఈ మేరకు సర్కారుకు తీరును ఖండిస్తూ.. పార్వతీపురం కలెక్టరేట్‌ శిబిరం వద్ద అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. ఈ నెల 5న విధుల్లో చేరకుంటే చర్యలు తీసుకుంటామని సర్కారు బెదిరించడం తగదన్నారు. చర్చల పేరిట కాలయాపన చేస్తూ.. చిరుద్యోగులై నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమ్మె విరమించాలని ఆదేశాలివ్వడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకుంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. వారికి సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. పాలకొండ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట, సీతానగరం, కురుపాంలో అంగన్‌వాడీలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ‘జగనన్నా నీకో దండం.. మా డిమాండ్లు నెరవేర్చు’ అంటూ సాలూరులో ఒంటి కాలిపై నిలబడి.. దండం పెడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కొమరాడలోని అంతర్రాష్ట్ర రహదారిపై వెళ్తున్న పలు వాహనాలను ఆపి శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - Jan 05 , 2024 | 12:18 AM