Share News

ఖరీఫ్‌కు కార్యాచరణ

ABN , Publish Date - May 19 , 2024 | 11:34 PM

ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ కార్యచరణ సిద్ధం చేసింది. అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రణాళిక తయారు చేసింది. ఇప్పటికే జిల్లాలో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఖరీఫ్‌కు కార్యాచరణ

- 46,530 క్వింటాళ్ల వరి విత్తనాల సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ ప్రణాళిక

- 51,476 మెట్రిక్‌ టన్నుల ఎరువులు కూడా..

గంట్యాడ, మే 19: ఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ కార్యచరణ సిద్ధం చేసింది. అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రణాళిక తయారు చేసింది. ఇప్పటికే జిల్లాలో అకాల వర్షాలు కురవడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో ఈ ఖరీప్‌ సీజన్‌లో సుమారు 94 వేల హెక్టార్లలో వరి, 10వేల హెక్టార్లలో మొక్కజొన్న, 4వేల హెక్టార్లలో నువ్వులు, 2వేల హెక్టార్లలో పత్తి, 400 హెక్టార్లలో గోగు, 4వేల హెక్టార్లలో చెరుకు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరి విత్తనాలకు సంబంధించి ఎంటీయూ 1121 రకం 35,154 క్వింటాలు, ఎంటీయూ1224 రకం 3,146, సోనమసూరి 2,110, సాంబమసురి 1,640, స్వర్ణ 810, ఎంటీయూ 1318 రకం 930, ఎంటీయూ 1064 రకం 2,500 క్వింటాల విత్తనాలను రైతులుకు అందజేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. అలాగే పచ్చి రొట్ట విత్తనాలు 2,517 క్వింటాలు, మినుములు 90, పెసలు 50, వేరుశనగ 900, రాగులు 55, నువ్వులు 120 క్వింటాల విత్తనాలు పంపిణీ చేయనున్నారు. అలాగే, జిల్లాలో అన్ని రకాల పంటలకు 51,476 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగం పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ ఎరువులు అందజేయనున్నారు. యూరియా 26,662 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 11,164 టన్నులు, ఎంవోపీ 2,235 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 9,871టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1545 టన్నులు సరఫరా చేయనుంది.

Updated Date - May 19 , 2024 | 11:34 PM