Share News

ప్రశాంత ఎన్నికలకు చర్యలు

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:58 PM

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 ప్రశాంత ఎన్నికలకు చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

బెలగాం, ఫిబ్రవరి 28: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటి దర్యాప్తుపై ఆరా తీశారు. కేసులకు సంబంధించిన రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఎన్నికలకు పోలీసులందరం సిద్ధంగా ఉండాలన్నారు. సజావుగా ఎన్నికలు జరిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమస్యా త్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, ఆ ప్రాంతాలను సెక్టార్‌లగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించాలని తెలిపారు. నిరంతరం నిఘా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్న పొరపాటు జరగకూడదని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు సమాచారం సేకరించాలని తెలిపారు. గతంలో నిందితులుగా ఉన్నవారిని గుర్తించి, నిఘా పెట్టాలని చెప్పారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని, అక్రమ మద్యం, నగదు రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. నగదు, మాదక ద్రవ్యాలు రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ తయారు చేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, పార్వతీపురం ఏఎస్పీ సునీల్‌ షరోన్‌, దిశా డీఎస్పీ హర్షిత, పాలకొండ డీఎస్పీ కృష్ణారావు, పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పలువురికి ప్రశంసాపత్రాలు

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రశంసా పత్రాలు అందజేశారు. మిస్సింగ్‌ కేసు ఛేదనలో బత్తిలి పీఎస్‌కు చెందిన ఏఎస్‌ఐ కాంతారావుకు, కానిస్టేబుల్‌ సరోజినికి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలో పార్వతీపురం రూరల్‌ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌ శివ ప్రసాద్‌కు, శంబర జాతరలో చక్కగా విధులు నిర్వహించిన మక్కువ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌ జగదీశ్వరరావులకు ప్రశంసా పత్రాలు అందించారు.

Updated Date - Feb 28 , 2024 | 11:58 PM