Share News

జేఈఈ మెయిన్స్‌లో జిల్లా విద్యార్థుల సత్తా..

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:14 PM

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు.

 జేఈఈ మెయిన్స్‌లో  జిల్లా విద్యార్థుల సత్తా..

సాలూరు రూరల్‌/పాలకొండ, ఏప్రిల్‌ 24: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. పాలకొండకు చెందిన చింటు సతీష్‌కుమార్‌ ఆల్‌ ఇండియా స్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో 8వ ర్యాంకు ఓబీసీ కేటగిరీలో రెండో స్థానం సాధించి సత్తాచాటాడు. పాలకొండకు చెందిన ఈ విద్యార్థి ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విశాఖలో విద్యనభ్యసించాడు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది పాయింట్లు సాధించారు. ఇంటర్‌ సీబీఎస్‌ఈ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. సతీష్‌కుమార్‌ తల్లిదం డ్రులు చింటు బుచ్చెన్న లుంబూరులోని ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి రమాదేవి విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని ఆమదాలవలస కాలనీలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్స్‌లో సతీష్‌కుమార్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చడంపై తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంజనీర్‌గా స్థిరపడడం తన లక్ష్యమని సతీష్‌కుమార్‌ తెలిపారు.

ఫలితాల్లో మెరిసిన లోచన్‌

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో సాలూరుకు చెందిన మరడాన సాయి శివ లోచన్‌ ఆలిండియా జనరల్‌లో 93 ర్యాంక్‌, ఓబీసీలో 16వ ర్యాంక్‌ను సాధించాడు. తొలి, రెండో విడత ఫలితాల్లో సగటున 99.99 శాతం చొప్పున పర్సెంటైల్‌ను సాధించాడు. ఆ విద్యార్థి పదో తరగతి వరకు గుడివాడ, ఇంటర్‌ విజయవాడలో చదివాడు. లోచన్‌ తండ్రి మోహనరావు, తల్లి సునీత పాచిపెంట మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కాగా లోచన్‌ వచ్చే నెల 26న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రాయనున్నాడు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో మంచి ర్యాంక్‌ సాధించిన ఆ విద్యార్థికి పలువురు ఉపాధ్యాయులు, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ,పాచిపెంట ఎంఈవోలు అభినందనలు తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 11:14 PM