Share News

అభివృద్ధిని వదిలేశారు

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:22 PM

ఏడు దశాబ్దాలకు పైగా శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మమేకమైన రాజాం ప్రాంతం సరిగ్గా రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో విలీనమైంది.

అభివృద్ధిని వదిలేశారు
విస్తరణ పూర్తికాని రాజాం-డోలపేట రహదారి

-రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో కలిసి రెండేళ్లు

-రెవెన్యూ డివిజన్‌ హుళక్కే

-నిలిచిన ప్రధాన రోడ్డు విస్తరణ

-పూర్తి కాని టిడ్కో ఇళ్లు

-సొంత భవనాలు లేకుండా డిగ్రీ కళాశాల

-అధ్వానంగా రైతుబజారు

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 5: ఏడు దశాబ్దాలకు పైగా శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మమేకమైన రాజాం ప్రాంతం సరిగ్గా రెండేళ్ల క్రితం విజయనగరం జిల్లాలో విలీనమైంది. అభివృద్ధిలో మాత్రం ఏ మార్పూ రావడం లేదు. రెవెన్యూ డివిజన్‌ బొత్స సామ్రాజ్యంలో ఏర్పాటైంది. ఏళ్లుగా ఉన్న సీటీవో కార్యాలయం ఊరు దాటింది. రెండోవిడత రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయలేని దుస్థితి నెలకొంది. కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి రావాలంటే రేగిడి, వంగర, సంతకవిటి మండాల ప్రజలకు కన్నీళ్లు తప్పడం లేదు. రెండేళ్లలో అదనంగా వచ్చి చేరిందేమీ లేకపోయినా ప్రజలకు వెతలు తప్పడం లేదు.

రెవెన్యూ డివిజన్‌ హుళక్కే..

రాజాంలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు దాదాపు ఖరారైంది. డీఎస్పీ, డిప్యుటీ డీఈవో తదితర డివిజన్‌ కార్యాలయాల ఏర్పాటు కోసం ఉన్నతాధికారులు పట్టణంలో అనువైన భవనాల కోసం పరిశీలించారు. ఎక్కడెక్కడ అనుకూలమో నిర్ధారించారు. చివరిక్షణంలో మున్సిపాలిటీగా ఉన్న రాజాంకు బదులు పంచాయతీగా ఉన్న చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు అధికారులు, ప్రభుత్వ పెద్దలు మొగ్గుచూపారు. డివిజన్‌ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కనీస ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని రాజాం ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

విస్త‘రణమే’

రాజాంలో రెండోవిడత రోడ్డు విస్తరణ పనులు రణాన్ని తలపిస్తున్నాయి. పరిపాలన, ఆర్ధికపరమైన ఆమోదంతో పాటు పనులు ప్రారంభించి సుమారు రెండేళ్లు కావస్తున్నా పనుల్లో ప్రగతిలేదు. నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్‌కు బకాయిలు చెల్లించలేదు. దీంతో ఆర్నెళ్ల క్రితం పనులు నిలిపివేసి కాంట్రాక్టర్‌ ఇంటిదారి పట్టారు.

సీటీవో కార్యాలయం ఎత్తివేత

రాజాంలోని సీటీవో కార్యాలయాన్ని రెండేళ్ల క్రితం (2022, ఆగస్టులో) ఎత్తివేసి ఆముదాలవలసలో ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో ఉన్న 19 మండలాలకు చెందిన జీఎస్టీ వ్యాపారులను మూడు సర్కిళ్లుగా విభజించారు. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలకు చెందిన జీఎస్టీ వ్యాపారులను విజయనగరం సౌత్‌ సర్కిల్‌లో విలీనం చేశారు. 13 మండలాలను ఆముదాలవలసలోనూ, మూడు మండలాలను పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు రాజాంలో ఉన్న కార్యాలయాన్ని ఇక్కడే ఉంచేలా సహకరించాలని ఉద్యోగులు మంత్రి బొత్స సత్యన్నారాయణను కలిసి వినతిపత్రం అందజేసినా ఫలితం లేకపోయింది. దీంతో జీఎస్టీ వ్యాపారులు విజయనగరం వెళ్లాల్సి వస్తోంది.

ప్రజలకు ఎన్నెన్నో వెతలు

- రాజాంను విజయనగరంలో విలీనం చేయడంతో రేగిడి, వంగర, సంతకవిటి మండలాల ప్రజల వెతలు వర్ణణాతీతం. కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి రావాలంటే హీనపక్షంగా 50 నుంచి 140 కిలోమీటర్లు ప్రయాణించాలి.

- టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయలేదు. అప్పులు చేసి డిపాజిట్లు చెల్లించి, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. జగనన్నకాలనీలోనూ సౌకర్యాలు లేవు.

- సోషల్‌ వెల్ఫేర్‌ డిప్యుటీ డైరెక్టర్‌ కార్యాలయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక పొందూరు తరలించినా అడ్డుకునే ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేయలేదు.

- ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భవనాలు నిర్మించలేని పరిస్థితి. ఫలితంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉదయం డిగ్రీ తరగతులు, మధ్యాహ్నం ఇంటర్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

- ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో రూ.కోటి వెచ్చించి భవన సముదాయం నిర్మించినా కాంట్రాక్టర్‌కు పూర్తిస్థాయి చెల్లింపులు చేయలేదు. దీంతో సారధి బాలికల పాఠశాలలో మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థినులకు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది.

- టీడీపీ హయాంలో సుమారు రూ.కోటితో నిర్మించిన రైతుబజార్‌ను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. మార్కెటింగ్‌శాఖ పరిధిలో ఉన్న రైతుబజార్‌ నిర్వహణ అధ్వానంగా ఉంది. రైతుబజార్‌ ఎదురుగా రోడ్డుపైనే కూరగాయల వ్యాపారాలు చేసేవారి సంఖ్య పెరగడంతో వ్యాపారాల్లేక, అద్దెలు, విద్యుత్‌బిల్లులు భరిస్తూ రైతుబజార్‌లోని వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

- మున్సిపాలిటి పరిధిలోని బుచ్చెంపేటలో నిర్మించిన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో కనీసం తాగునీరు కల్పించలేని పరిస్థితి. కాంపౌండ్‌వాల్‌ లేదు. హెల్త్‌సెంటర్‌కు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. అర్బన్‌హెల్త్‌ సెంటర్‌కు అవసరమైన వ్యాక్సిన్లు తెచ్చేందుకు ఆశావర్కర్లు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలోని పొగిరి పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తోంది.

Updated Date - Apr 05 , 2024 | 11:22 PM