Share News

కొత్త కళ

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:37 PM

కొత్త ఏడాదికి జిల్లా ప్రజలు సాదర స్వాగతం పలికారు. స్నేహితులు, బంధువులు, గురువులు, నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

కొత్త కళ
కలెక్టర్‌ నాగలక్ష్మికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న జేసీ మయూర్‌అశోక్‌

కొత్త కళ

జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుకలు

శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు

ఆలయాల్లో పూజలు

నేతల ఇళ్ల వద్ద కోలాహలం

విజయనగరం(ఆంధ్రజ్యోతి), జనవరి 1: కొత్త ఏడాదికి జిల్లా ప్రజలు సాదర స్వాగతం పలికారు. స్నేహితులు, బంధువులు, గురువులు, నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆలయాల్లో పూజలు చేశారు. మహిళలు ముంగిళ్లను రంగురంగుల రంగవల్లులతో అందంగా ముస్తాబు చేశారు. 2024కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఇక రాజకీయ నేతల ఇళ్ల వద్ద సందడే సందడి కనిపించింది. చిన్న నాయకులు కూడా కేక్‌లు కట్‌ చేస్తూ టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేశారు. డీజీ బాక్సుల్లో పార్టీల పాటలకు కార్యకర్తలు, అభిమానులు నృత్యాలు చేశారు. వెరసి నూతన సంవత్సరం తొలిరోజు కొత్త కళ కనిపించింది. డిసెంబరు 31న రాత్రి మందు విక్రయాలు అత్యధికంగా సాగాయి. మందుబాబులు గత ఏడాది కంటే రూ.కోటీ 50 లక్షల మద్యాన్ని అదనంగా తాగేశారు. రాత్రంతా యువత ఎంజాయ్‌ చేసింది. ఇక సోమవారం ఉదయం కొత్త దుస్తులతో కొంగొత్తగా కనిపించారు. ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పూలు, స్వీట్‌లు, పండ్లు విక్రయాలు బాగా సాగాయి. బోకేలను వినూత్నంగా తయారు చేశారు.

- ఎన్నికల ఏడాది కావడంతో ఆ ప్రత్యేకత స్పష్టంగా కనిపించింది. ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి ఇళ్లకు క్యూ కట్టారు. నేతలను ఎప్పుడూ కలవని వారు కూడా ఎందుకైనా మంచిది ఎన్నికలకు ముందే ఓసారి ప్రసన్నం చేసుకుందామని పయనమయ్యారు. మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఇళ్ల వద్ద కోలాహలం నెలకొంది. నియోజకవర్గ నాయకులు, మండల నాయకుల గృహాల వద్ద కూడా సందడి కనిపించింది.

కలెక్టరేట్‌: కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకులు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ నాగలక్ష్మికి సోమవారం ఉదయం అనేక మంది అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జేసీ మయూర్‌అశోక్‌, ట్రైనీ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, డీఆర్‌వో ఎస్‌డీ అనిత, మున్సిపల్‌ కమిషనర్‌ రెడ్డి శ్రీరాములు నాయుడు, ఇతర అధికారులు కలిశారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికాపాటిల్‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 11:37 PM