Share News

కోలగట్లకు భారీ షాక్‌

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:52 PM

విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రరావు భారీ షాక్‌ తగిలింది. నగరానికి చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నట్లు మంగళవారం ప్రకటించారు.

కోలగట్లకు భారీ షాక్‌
రాజీనామా లేఖలను చూపిస్తున్న వైసీపీ నాయకులు

కోలగట్లకు భారీ షాక్‌

విజయనగరంలో అధికారపార్టీకి ఎదురు దెబ్బ

పార్టీని వీడుతున్నట్లు వెల్లడించిన ముఖ్య నాయకులు

అధినాయకత్వానికి పోస్టులో రాజీనామా లేఖలు

డిప్యూటీ స్పీకర్‌ వీరభద్రరావు వైఖరే కారణమని ధ్వజం

మాన్సాస్‌ భూములను కొల్లగొట్టాలనుకున్నారని తీవ్రఆరోపణ

డిప్యూటీ మేయర్‌ పదవిని కుమార్తెకు కట్టబెట్టారని మండిపాటు

విజయనగరం(ఆంధ్రజ్యోతి):

విజయనగరంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రరావు భారీ షాక్‌ తగిలింది. నగరానికి చెందిన ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. వైసీపీ అంటే కోలగట్ల ఫ్యామిలీయేనని, ఆయన తీరు వల్లే పార్టీని వీడుతున్నామని అవనాపు విజయ్‌, పిళ్లా విజయ్‌కుమార్‌ అన్నారు. చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు దూరాయని, మొదటినుంచి వైసీపీకి సేవలందించిన వారికి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలాజీనగర్‌లోని విజయ్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తాము ఒక నియంత వల్ల పార్టీని వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నప్పటికీ ఆయన ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయారన్నారు. అనేక పర్యాయాలు అధిష్టానం దృష్టికి, జిల్లా పెద్దల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వారు సమన్వయ పరిచే చర్యలేవీ తీసుకోలేదని నిరాశ వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి పార్టీని పెట్టినప్పుడు ఆ పార్టీకి తొలుత అండగా నిలిచింది అవనాపు సూరిబాబేనని, ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు కూడా అవనాపు కుటుంబీకులే అన్నీతామై చూశారన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి పార్టీలో చేరతారని జగన్మోహన్‌రెడ్డి తమతో చర్చించినప్పుడు తామూ ఆహ్వానించామని, పార్టీలోకి వచ్చిన తరువాత ఆయన తమను పక్కను పెట్టడం ప్రారంభించారని, అనేక విధాలుగా అవమానపరిచారని అన్నారు. ఇంత కాలం ఓపిక పట్టామని, ఇక పార్టీలో ఉండడం మంచిది కాదని భావించి సీఎం జగన్‌, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యన్నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీనుకు పోస్టు ద్వారా రాజీనామా లేఖలను పంపించామని తెలిపారు.

- ఎమ్మెల్యే కోలగట్ల తీరులో ఎటువంటి మార్పు రావడంలేదని, కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ పదవిని దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని అధిష్టానాన్ని కోరగా ఆ పదవిని తన కుమార్తెకు కట్టబెట్టారన్నారు. ఏ కార్పొరేటర్‌కూ ఎటువంటి అధికారం లేదని.. వారి, వారి డివిజన్లలో కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలన్నా ఎమ్మెల్యే కోలగట్లని సంప్రదించాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు. అన్నింటా ఎమ్మెల్యే అల్లుడు కమీషన్‌ తీసుకుని పనులు చేయిస్తున్నారన్నారు. ప్రాంతాల వారీగా విజయనగరాన్ని విభజించి వారి కుటుంబీకులను ఆ ప్రాంతాలకు సామంతులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

- మాన్సాస్‌ ట్రస్టు విషయంలో తలదూర్చవద్దని సాక్షాత్తు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినా వినకుండా ఆ సంస్థ భూములను సొంతం చేసుకునేందుకు మాన్సాస్‌ కమిటీలోకి చొరబడ్డారన్నారు. అందులో భాగంగా ఆనందగజపతిరాజు తొలి భార్య కుమార్తెను తీసుకువచ్చి మాన్సాస్‌కి చైర్మన్‌ చేశారన్నారు. చివరికి న్యాయం గెలిచి అశోక్‌గజపతిరాజు చైర్మన్‌ అయ్యారన్నారు. విజయనగరంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించలేదంటే స్థానిక ఎమ్మెల్యేకి బీసీలు, ఎస్సీలు అంటే ఎంత చులకనో అర్థమౌతుందన్నారు. మరో నాలుగు రోజుల్లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. సమావేశంలో మాజీ కౌన్సిలర్లు గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 19వ తేదీన అవనాపు విజయ్‌ అశోక్‌ బంగ్లాలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Updated Date - Feb 13 , 2024 | 11:52 PM