Share News

వైభవంగా చక్రతీర్థ స్నానం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:22 AM

ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి.

వైభవంగా చక్రతీర్థ స్నానం
నాగావళి నదీ తీర ప్రాంతంలో స్వామివారికి చక్ర తీర్థ స్నానం చేస్తున్న అర్చకులు

గరుగుబిల్లి, ఫిబ్రవరి 24 : ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజు పవిత్ర నాగావళి నదీ తీర ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు చూర్ణోత్సవం, చక్రతీర్థ స్నానం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో నిత్యారాధన, విశేష హోమాలు, మంగళ శాసనములుతో పాటు పలు పూజలను అర్చకులు వీవీ అప్పలాచార్యులు, వీవీ శశిధర్‌, ఎం.గోవర్ధన్‌ చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పల్లకిలో తిరువీధి మహోత్సవం నిర్వహించి తదుపరి నాగావళి నదీ తీర ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. చక్రతీర్థ స్నానం కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొని పులకించిపోయారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో వీవీ సూర్యనారాయణ, ఆలయ చైర్మన్‌ ఎం.సత్యనారాయణతో పాటు సభ్యులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తంగా నదీ తీర ప్రాంతం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:22 AM