Share News

నిప్పుల కుంపటి

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:41 PM

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజూ 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత , ఉక్క పోతతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 నిప్పుల కుంపటి
సాలూరు రూరల్‌: ఉదయం 11 గంటలకు నిర్మానుష్యంగా జీగిరాం వద్ద హైవే..

విలవిల్లాడుతున్న ప్రజలు

సాలూరు రూరల్‌/మక్కువ: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజూ 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత , ఉక్క పోతతో జిల్లావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొత్తంగా అధిక ఎండలతో జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి. రాత్రి ఏడు గంటలైనా వాతావరణం చల్ల బడడం లేదు. జిల్లాలో 15 మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం పది గంటల తర్వాత ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ శుక్రవారం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి వేళల్లో 36 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవగా.. జిల్లావాసులు అల్లాడిపోయారు. వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడిపోయారు. రాత్రియినా వేడి తగ్గకపోవడంతో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. మరోవైపు సరుకు రవాణా చేసే వాహన చోదకులు, చిరు వ్యాపారులు, కూలీలు సైతం నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం వేళల్లో చెట్ల వద్దకు పరుగులు తీశారు. మరికొందరు శీతలపానియాలు తాగి కాస్త ఉపశమనం చెందారు. కాగా మరి కొద్ది రోజుల పాటు ఎండలు అధికంగానే ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ప్రకటించిన నేపథ్యంలో జిల్లావాసులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఫొరెన్సిక్‌ నిపుణుడు డాక్టర్‌ సంజీవనాయుడు సూచించారు. వివిధ పనులపై బయటకు వచ్చే వారు తగిన సంరక్షణ చర్యలు పాటించాలన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:41 PM