Share News

నిరసన హోరు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:40 PM

ఉద్యోగ, ఉపాధ్యాయులు కదంతొక్కారు. సర్కారుకు వ్యతిరేకంగా నిరసన స్వరం పెంచారు. గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం పార్వతీపురంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

నిరసన హోరు
పార్వతీపురంలో ర్యాలీ చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

సమస్యలు పరిష్కరించాలని, హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

బెలగాం, ఫిబ్రవరి 20: ఉద్యోగ, ఉపాధ్యాయులు కదంతొక్కారు. సర్కారుకు వ్యతిరేకంగా నిరసన స్వరం పెంచారు. గతంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం పార్వతీపురంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని జిల్లా ప్రభుత్వ కార్యాలయాల సమూహం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి.. మాట తప్పారని.. నేడు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. పీఎఫ్‌, జీపీఎఫ్‌ డబ్బులను ఇవ్వకుండా ప్రభుత్వం వాటిని దారి మళ్లించి వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం న్యాయమా? అని వారు ప్రశ్నించారు. రిటైర్మెంట్‌ అయిన వారికి 2027లో గ్రాట్యుటీ ఇస్తానని జీవోలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. సీపీఎస్‌ బదులు జీపీఎస్‌ ఇస్తామంటూ ప్రభుత్వం ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తక్షణమే ఓపీఎస్‌ పునరుద్ధరించాలని, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, డీఏలు, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, ఐఆర్‌ 30శాతం ప్రకటించాలని, హెల్త్‌, పోలీస్‌ శాఖల ఉద్యోగులకు అలవెన్స్‌లు ఇవ్వాలని నినాదాలు చేశారు. సర్కారు దిగి రాకుంటే ఈ నెల 27న పెద్దఎత్తున ధర్నా చేస్తామని, గతంలో విజయవాడలో చేసిన నిరసన మళ్లీ పునరావృతం అవుతుందని వారు హెచ్చరించారు. ఈ నిరసనలో జేఏసీ నాయకులు ఎస్‌.మురళీ, జి.జగన్నాథం, డి.గణపతిరావు, సీహెచ్‌ శంకర్రావు, దుర్గ, సత్యనారాయణ , కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:40 PM