Share News

నిరసన హోరు

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:52 PM

సమస్యల పరిష్కారం, హామీల అమలు కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రం పార్వతీపురంలో వారు నిరవధిక దీక్షను కొనసాగించారు.

నిరసన హోరు
గుమ్మలక్ష్మీపురం: పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు

29వ రోజుకు సమ్మె

సర్కారు తీరుపై ఆగ్రహం

హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

బెలగాం/సాలూరు/గరుగుబిల్లి/గుమ్మలక్ష్మీపురం/సీతంపేట/కురుపాం, జనవరి 9: సమస్యల పరిష్కారం, హామీల అమలు కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 29వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రం పార్వతీపురంలో వారు నిరవధిక దీక్షను కొనసాగించారు. పాలకొండ ప్రాజెక్టుకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరై వారికి సంఘీభావం తెలిపారు. సీఎం జగన్‌ మొండి వైఖరి వీడాలని, కక్షపూరిత చర్యలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ గోడు విని డిమాండ్లు నెరవేర్చాలని, ఎస్మా చట్టాన్ని రద్దుచేయాలని నినదించారు. రాత్రి నిరసన శిబిరం వద్దే చలిలో పడుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. సాలూరులో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని శిబిరం వద్ద అంగన్‌వాడీలు కళ్లకు గంతలు కట్టుకోని నిరసన ప్రదర్శన చేపట్టారు. గరుగుబిల్లిలో కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. చిరుద్యోగులపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. సర్కారు తీరును ఖండిస్తున్నామన్నారు. సర్కారు దిగి రాకుండా సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఇక గుమ్మలక్ష్మీపురంలో అంగన్‌వాడీలు ప్రధాన రహదారిపై పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరవధిక దీక్షలో భాగంగా రాత్రి సీతంపేట ఐటీడీఏ ఎదుట శిబిరం వద్ద అంగన్‌వాడీలు పడుకుని నిరసన తెలిపారు. సర్కారు స్పందించకుంటే ఈ నెల 11 నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద దీక్ష చేపడతామని వారు చెప్పారు. కురుపాంలో శిబిరం వద్ద సాష్టాంగ నమస్కారాలు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

Updated Date - Jan 09 , 2024 | 11:52 PM