Share News

రూ.20కు రూ.27 లక్షలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:14 AM

అత్యాశకు పోతే అసలుకే మోసం వచ్చింది. పాత నాణేనికి రూ.లక్షల్లో ఇస్తామని నమ్మబలికిన మోసగాళ్ల వలలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు

రూ.20కు రూ.27 లక్షలు

కొత్తవలస, జనవరి 2: అత్యాశకు పోతే అసలుకే మోసం వచ్చింది. పాత నాణేనికి రూ.లక్షల్లో ఇస్తామని నమ్మబలికిన మోసగాళ్ల వలలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దేవాడ గ్రామానికి చెందిన కోన ఈశ్వరరావు(అయ్యప్ప) స్థానికంగా కిరాణా వ్యాపారంతో పాటు టెంటు హౌస్‌ అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల యూట్యూబ్‌ చూస్తుండగా పాత రూ.20 నాణెం ఉంటే రూ.లక్షలు గడించవచ్చుననే విషయం కనిపించింది. తన వద్ద పాత రూ.20 నాణెం ఉండడంతో యూట్యూబ్‌ చానెల్‌ లింక్‌పై క్లిక్‌ చేశాడు. తన వద్దనున్న పాత రూ.20 నాణెం ఫొటో తీసి చానెల్‌కు సంబంధించిన వాట్సాప్‌ నెంబర్‌కు మెసేజ్‌ చేశాడు. అక్కడి నుంచి చానెల్‌ నిర్వాహకులకు... ఈశ్వరరావుకు మధ్య లావాదేవీలు మొదలయ్యాయి. మొదట పాత రూ.20 నాణేనికి రూ.77 లక్షల వరకు ఇస్తామని నమ్మబలికారు. తరువాత కొద్దిసేపటికే మళ్లి ఫోన్‌ చేసి ప్రస్తుతం మార్కెట్‌లో అంత ధర లేక పోవడంతో రూ.27 లక్షల కంటే ఇవ్వలేమని బేరసారాలు మొదలుపెట్టారు. అప్పటికే కొన్ని అప్పులతో సతమతమవుతున్న ఈశ్వరరావు ఎంతో కొంత వస్తుంది కదా అని రూ.27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వారు మోసానికి తెరలేపారు. ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు రూ.1500 పంపించాలని కోరడంతో ఆయన ఆ మొత్తాన్ని పంపించాడు. రూ.27 లక్షలను పంపించడం కోసం ప్యాక్‌ చేస్తున్నట్టు కొన్ని ఫొటోలను పంపించారు. ఆ ఫొటోలను చూసిన ఈశ్వరరావు ఇదంతా నిజమనుకున్నాడు. సంబంధిత వ్యక్తులు ఈసారి జీఎస్‌టీ పేరుతో రూ.90 వేలు పంపించాలని కోరారు. అలా రూ.3.90 లక్షల వరకు పంపించాడు. చివరకు వాళ్లు టీడీఆర్‌ పేరుతో అర్జెంటుగా రూ.2.60 లక్షలు చెల్లిస్తే... ప్యాక్‌ చేసిన నగదును తమ వ్యక్తులు విశాఖపట్టణం ఎయిర్‌ పోర్టు వద్ద ఇచ్చేస్తారని తెలిపారు. వారికి రూ.20 నాణెం ఇచ్చి రూ.27 లక్షలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఈశ్వరరావు సిద్ధమయ్యాడు. తన అకౌంట్‌లో రూ.1.60 లక్షలు మాత్రమే ఉండడంతో మిగిలిన రూ.లక్ష సమకూర్చేందుకు తన సన్నిహితుడైన రామలింగాపురానికి చెందిన కొల్లూరు శ్రీధర్‌ని అప్పుగా అడిగాడు. ఎంత వడ్డీ అయినా వెనకాడొద్దని చెప్పడంతో అంత అవసరం ఏమొచ్చిందని ఆయన ఆరా తీశాడు. దీంతో ఈశ్వరరావు అసలు విషయం చెప్పాడు. ఇది మోసమని ఆయన చెప్పినా నమ్మలేదు. దీంతో శ్రీధర్‌ పోలీసు శాఖలో తనకు తెలిసిన కొంతమందిని సంప్రదించాడు. అదంతా మోసమని వారు కూడా చెప్పారు. దీంతో ఇద్దరూ కలసి కొత్తవలస పోలీసులను ఆశ్రయించడంతో ఎస్‌ఐ వీరజనార్దన్‌ కేసు నమోదు చేశారు. ఈ మోసగాళ్లు ఢిల్లీకి చెందిన వారుగా తెలింది. ప్రస్తుతం ఈ డబ్బులు జమ చేసిన బ్యాంక్‌ అధికారులను సంప్రదించి బ్లాక్‌ చేయాలని కోరడంతో హోల్డ్‌లో ఉంచారు. అయితే...ఇప్పటికీ బాధితుడు ఈ మోసాన్ని గుర్తించినట్టు కనిపించడం లేదు. వారితో సంప్రదిస్తూ... మోసగాళ్లను నమ్ముతూనే ఉండడం గమనార్హం.

Updated Date - Jan 03 , 2024 | 12:15 AM