Share News

16 మంది సిబ్బంది.. ఒక్కరే హాజరు

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:09 AM

మాదలంగి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులతో పాటు 14 మంది సిబ్బంది ఉండగా, ఎమ్మెల్యే పరిశీలనలో కేవలం ఒక ఒక్కరు హాజరైన వైనం వెలుగులోకి వచ్చింది.

16 మంది సిబ్బంది.. ఒక్కరే హాజరు

కొమరాడ: మాదలంగి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులతో పాటు 14 మంది సిబ్బంది ఉండగా, ఎమ్మెల్యే పరిశీలనలో కేవలం ఒక ఒక్కరు హాజరైన వైనం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మాదలంగి గ్రామంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఉదయశేఖరపాత్రుడు బంధువు ఎంపీపీ శ్యామలను పరామర్శించేందుకు ఎమ్మెలే ్య తోయక జగదీశ్వరి వెళ్లగా, అక్కడి స్థానికులు పీహెచ్‌సీ పరిస్థితిని ఆమెకు వివరించారు. దీంతో ఆమె మధ్యాహ్నం 3 గంటలకు ఆకస్మికంగా పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సమయంలో స్టాఫ్‌ నర్సు నాగమణి తప్ప మిగిలిన సిబ్బంది ఎవరూ లేరు. పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులు, ఒక దంత వైద్యుడు ఉండగా, అందులో ఒక వైద్యాధికారి, దంత వైద్యుడు ఈనెలలో ఒక్కరోజు కూడా హాజరు కానట్టు గుర్తించారు. ఇక రెండో వైద్యాధికారి ఈనెల 5 వరకు వచ్చినట్టు రిజిస్టర్‌లో సంతకం చేసి ఉంది. అలాగే సిబ్బంది కూడా అనేకమంది ప్రతిరోజు వచ్చినట్లు ఎక్కడ సంతకాలు లేవు. దీంతో గ్రామస్థులు చెప్పిన మాటలు వాస్తవమేనంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతానన్నారు. ఎమ్మెల్యే పీహెచ్‌సీ పరిశీలిస్తున్న సమయంలో జి.గంగరాజు అనే వ్యక్తిని అస్వస్థతతో పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్యులు లేకపోవడంతో స్టాఫ్‌ నర్సు వెంటనే జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వెంటనే ఎమ్మెల్యే.. 108 వాహనం తెప్పించి గంగరాజును జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా కొత్త కలెక్టర్‌ పీహెచ్‌సీల పనితీరు మెరుగుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్‌ చంద్రదేవ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ శేఖరపాత్రుడు, పి.వెంకటినాయుడు, డి.వెంకటినాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పావని, మాజీ ఎంపీటీసీ సభ్యుడు త్రినాథం, తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:10 AM